మెజారిటీ పై కొనసాగుతున్న చర్చలు

by Naresh N |
మెజారిటీ పై కొనసాగుతున్న చర్చలు
X

దిశ, చేగుంట: శాసనసభ ఎన్నికల సమరం పూర్తి కావడంతో ఎవరికివారు గెలుపు ఓటముల పై చర్చించుకోవడం ప్రారంభించారు. గ్రామాల వారీగా పోలైన ఓట్లు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చర్చించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచార కార్యక్రమాలలో పార్టీల వారీగా గ్రామాలలో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రచార కార్యక్రమం ముగిసిన అనంతరం జరిగిన పోల్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో జరిగిన ఓటుకు నోటు పంపిణీ కార్యక్రమం పై పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో ఈవీఎంలలో నిక్షిప్తంగా ఉన్నప్పటికీ గ్రామాల వారీగా ఓటింగ్ విషయమై లెక్కలు వేసుకుంటున్నారు. తమ పార్టీకి మా గ్రామంలో ఎక్కువగా ఓట్లు పడ్డాయని ఎవరికి వారు ఆశాభావంతో ఉంటున్నారు.

అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వారు తామే మండలంలో మెజార్టీ తెచ్చుకుంటామని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐదువేల వరకు మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. పోలింగ్‌కు ముందు రోజు జరిగిన పోల్ మేనేజ్మెంట్ వల్ల ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. అదే విధంగా బీజేపీ నాయకులు సైతం చేగుంట మండలంలో లీడింగ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఓటుకు నోటు ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం కమలం పువ్వు గుర్తుకే ఓటు వేశారని చేగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని పేర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వేవ్ ద్వారా మెజార్టీ వచ్చే అవకాశాలను తోసిపుచ్చడం లేదు. మండలంలో మొత్తం 30,969 ఓట్ల గాను 85.65% తో 26,492 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం అధికంగా నమోదు కావడం వలన వెళ్లిన వారు సైతం గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ఓటు వేయడంతో ఎవరికి ఓటు వేశారు అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. ఈనెల మూడవ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎవరు విజేత ఎవరికి ఏ మండలంలో ఎక్కువ ఓట్లు వచ్చాయి అనే విషయం స్పష్టమవుతుంది. అప్పటివరకు పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటూ కాలం గడపాల్సిందే.



Next Story

Most Viewed