250 మందికి స్కూటీలు పంచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. ఉద్వేగానికి లోనైన దివ్యాంగులు

by Disha Web Desk 12 |
250 మందికి స్కూటీలు పంచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. ఉద్వేగానికి లోనైన దివ్యాంగులు
X

దిశ, పటాన్‌చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ప్రజలు ప్రగతి పథంలో పయనిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రజల్ని అధోగతి పాలు చేస్తుందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద 250 మంది దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన ఎమ్మెల్యే గూడెం ఏ కార్యక్రమం సంచలనంగా , వినూత్నంగా నిర్వహిస్తారన్నారు. అనునిత్యం ప్రజా శ్రేయస్సు కై తపిస్తూ అటు అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. గతంలో నియోజకవర్గంలో విద్యార్థులందరికీ వారికి కావలసిన పుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేశారని ప్రస్తుతం దివ్యాంగుల జీవితాల్లో వెలుగుల నింపేలా 3 కోట్ల రూపాయలతో 250 మంది దివ్యాంగులకు స్కూటీలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

ఈ స్కూటీల పంపిణీ ద్వారా దివ్యాంగులకు కొండంత ధైర్యాన్ని నింపడమే కాకుండా వారి జీవితంలో గుణాత్మక మార్పు తెస్తుందని తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో మార్పు తెచ్చే సమున్నత లక్ష్యంతో అందించిన ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు నెలకు 3016 రూపాయల పెన్షన్ అందిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వాల్లో సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేసారని విమర్శించారు. వేసవి కాలం వస్తే ఎటు చూసినా కరెంటు కోతలతో జనరేటర్ రణధ్వనులు, పరిశ్రమలకు పవర్ హాలిడే ఉండేదన్నారు.

కానీ సీఎం కేసీఆర్ అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నారన్నారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాల అమలు చేస్తూ సామాన్య ప్రజలకు సంపద సృష్టిస్తుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదానిలకు సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతూ మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.

ఒకప్పుడు పటాన్ చెరు ప్రాంతం కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటే నేడు కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధికి చిరునామాగా మారిందన్నారు. పటాన్ చెరు రూపు రేఖల్ని మార్చేలా 200 ఎకరాల్లో కాలుష్య రహిత సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్, శివనగర్ లో ఎల్ఈడి పార్క్, హైదరాబాద్కు పరిమితమైన ఐటీ పరిశ్రమలు పటాన్చెరు నియోజకవర్గం లోని ఉస్మాన్ నగర్ వరకు విస్తరించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

గత ప్రభుత్వాలు ప్రజలకు కన్నీరు పెట్టిస్తే సీఎం కేసీఆర్ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నాడని వెల్లడించారు. ఈ ప్రాంతంలో తాగునీటి కష్టాలను తీర్చి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీరా నీటిని అందిస్తున్నామన్నారు. 20 కోట్ల రూపాయలతో తాగునీటి పైప్ లైన్ పునరుద్ధరణకు శంకుస్థాపన చేశామన్నారు. త్వరలో 250 కోట్లతో పటాన్ చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఇక్కడ ప్రజలు వైద్యం కోసం అపోలో యశోద వంటి కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.


అనునిత్యం అభివృద్ధి కోసం తపించే నాయకుడు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు కు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావాలని అడుగుతున్నారని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అత్యంత వివక్షతకు గురైతున్న దివ్యాంగులకు భరోసా కల్పించే లక్ష్యంతో 250 మందికి ద్విచక్ర వాహనాలను అందిస్తున్నామన్నారు. గడప దాటాలంటే మరొకరిపై ఆధారపడి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు మంత్రి హరీష్ రావు సహకారంతో పటాన్ చెరు లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 200 మంది ఐకేపీ మహిళ ఉద్యోగులకు యూనిఫార్మ్,ఐ డి కార్డు లు అందిస్తున్నామన్నారు. మంత్రి హరీష్ రావు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరింతగా తీర్చిదిద్దుతా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కలలోనైనా ఊహించలేము

దివ్యాంగులకు చేదోడు అందించేలా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేను. సమాజం నుంచి వివక్షత ఎదుర్కొంటున్న దివ్యాంగులకు ఆదరించి ద్విచక్ర వాహనాలను అందించడం సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఇలాంటి సహాయం అందుతుందని కలలో కూడా ఊహించలేదు. డిగ్రీ పూర్తి చేసి నేను బీహెచ్ఇఎల్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. ప్రతి రోజు అతి కష్టం మీద ఆటో లో ప్రయాణం చేస్తూ విధులు నిర్వహిస్తున్నాను.ఇప్పడు సొంత వాహనం మీద ఉద్యోగానికి వెళ్తాను. ఇంత గొప్ప సహకారం అందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సహాయాన్ని మర్చిపోలేము. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. థాంక్యూ యూ జీఎంఅర్ సర్..:- రూప రాణి పటాన్ చెరు

ఆపద్బాంధవుడు మా మహిపాల్ అన్న

అభాగ్యులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఆపద్బాంధవుడు మా మహిపాల్ అన్న. నాకు రెండు సంవత్సరాల వయసులో ఇంటి బయట ఆడుకుంటుండగా లారీ ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయాను. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన వేరే వ్యక్తుల మీద ఆధారపడి ప్రయాణించాల్సిందే. పఠాన్ చెరు పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాను. నా వ్యాపార విషయంలో సైతం అనేక వ్యయ ప్రయసాలకోర్చి కిరాయి వాహనంలో ప్రయాణించేవాడిని. ఇప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ అన్న ఇచ్చిన అండ దండలు,గుండె ధైర్యంతో ఇప్పుడు ఎక్కడైనా నా పనులు నేను సొంతంగా చేసుకోవచ్చు. మహిపాల్ అన్న ఇచ్చిన బహుమతిని జీవితాంతం మర్చిపోలేను. ఇప్పుడు సొంత వాహనంపై నా వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు. ఇంత గొప్ప సహాయం చేసిన గూడెం బ్రదర్స్ కు జీవితాంతం రుణపడి ఉంటాను:- సంతోష్ పటాన్ చెరు

Next Story

Most Viewed