లిల్లీపుట్స్ గాళ్లదే రాజ్యం

by Disha Web Desk 15 |
లిల్లీపుట్స్ గాళ్లదే రాజ్యం
X

దిశ, సంగారెడ్డి : 15 ఏండ్లు ఉద్యమించి సాధించుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, కానీ నేడు లిల్లీపుట్స్ గాళ్ల రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆందోలు సెగ్మెంట్ లోని సుల్తాన్ పూర్ లో జహీరాబాద్, మెదక్ పార్టమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం లిల్లీపుట్ గాళ్ల పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ఆ మాట ఎందుకంటున్నానంటే ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.

ఎన్నికల్లో రైతులకు మాట ఇచ్చి తప్పారని, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లు, మక్కలకు బోనస్ రూ.500లు, మహిళలకు రూ.2500లు, పింఛన్ రూ.4 వేలు ఇస్తామని మాట తప్పారని, అందుకే తాను వారిని లిల్లీ పుట్స్ గాళ్లు అంటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 15 సంవత్సరాలు పోరాటం చేసి చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి పెడితే ప్రస్తుత ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంబేద్కర్ కు ముఖ్యమంత్రితో పాటు వారి ప్రభుత్వం నివాళి అర్పించలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగులు ఏర్పాటు

చేస్తే ఆ విగ్రహం వద్ద ఒక్క పూవు పెట్టి నివాళి అర్పించలేదన్నారు. తాను అంబేద్కర్ విగ్రహం పెట్టానని నివాళి అర్పించలేదా అంటూ ప్రశ్నించారు. అయితే యాదాద్రి నేనే కట్టాను అందులోకి వెళ్లి పూజలు ఎలా చేస్తున్నారని, సెక్రెటరేట్ నేనే కట్టాను అందులో ఎలా కూర్చుంటున్నారని, ఎమ్మెల్యే క్వార్టర్స్ నేనే కట్టాను అందులో ఎలా ఉంటున్నారని, అన్నీ అక్కరకు వచ్చి నేను కట్టిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు ఎందుకు అర్పించలేదని ప్రశ్నించారు.

రైతులు రుణమాఫీపై పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి..

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో రైతులు రుణమాఫీ కావాలని కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారని, రాష్ట్రంలోని రైతులందరూ తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీతో పాటు పంటలు నష్టపోయిన వారికి ఎకరాకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని ఉద్యమం సాగించాలన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్

పార్టీ ఉంటుందన్నారు. రైతులకు ఇచ్చిన బోనస్ బోగస్సయిందని మండిపడ్డారు. వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్ ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులకు రైతుబంధు రాలే.. కరెంట్ సరిగా రాకపోయే..ప్రస్తుతం పంటలు కోతకు వచ్చాయని, వాటిని కొనేవారే లేకపాయే ..కాంటాలు పెట్టేదిక్కులేకపాయే అన్నారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ ఇప్పుడు ఇవ్వలేకపోతే వారికి బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుంది..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలి పోతుందని కేసీఆర్ జోష్యం చెప్పారు. ఎవ్వరూ ఎప్పుడు ఏ పార్టీలోకి పోతారో తెలియదు.. ముఖ్యమంత్రి రాష్ట్రంలో బీజేపీని తిడతడు..ఢిల్లీలో మోడీని కలుస్తాడు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశం ఉందన్నారు. దీని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

సింగూరు జలాలను పూర్తిగా తాగుకు, సాగుకు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కు తరలించారని మండి పడ్డారు. మెదక్ గడ్డ తనని ఆదరించిందని, ఉమ్మడి మెదక్ లో 7 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించామని, అదే విధంగా జహీరాబాద్, నారాయణఖేడ్ పార్టమెంట్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీలుగా బీఆర్ఎస్ గెలిస్తే పార్లమెంట్ లో ప్రశ్నించే అవకాశం ఉంటుందని, దాని వల్ల ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. బీజేపీకి ఓట్లు వేస్తే అక్కరకు రాకుండా పోతాయని, బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

మా ప్రభుత్వం వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం....

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు పోలీసుల సంగతి చూస్తామని కేసీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ఉద్యోగం చేయాల్సిన పోలీసులు రాజకీయాలు చేయొద్దని ఆయన అన్నారు. పోలీసులు చేస్తున్న పనులన్నింటినీ రికార్డు చేస్తున్నామని, త్వరలోనే సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ కార్యకర్తపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, ఆ కేసులను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, చింతా ప్రభాకర్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మానిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థులు గాలి అనిల్ కుమార్, వెంకట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed