రాజకీయ కుట్రదారులకు కోర్టు తీర్పు చెంప పెట్టు

by Disha Web Desk 15 |
రాజకీయ కుట్రదారులకు కోర్టు తీర్పు చెంప పెట్టు
X

దిశ,సంగారెడ్డి బ్యూరో : సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే అబద్ధపు ప్రచారంతో 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించడం, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడం శుభపరిణామమని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ వంటి రాజకీయ కుట్రదారులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని, స్వార్థ బుద్ధితో 106 కుటుంబాల్లో దు:ఖం నింపినప్పటికి ధర్మమే గెలిచిందన్నారు.

వాస్తవాలు ఎప్పటికైనా వెలుగు చూస్తాయని, కుట్రలు ఎప్పటికైనా బయటపడతాయని మరోసారి నిరూపితమయ్యాయని పేర్కొన్నారు. బాధిత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది తీర్పు కూడా ఉద్యోగులకు అనుకూలంగా వస్తుందని, ధర్మమే గెలుస్తుందని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని తన మీద రాజకీయ దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఎవరేంటో అనేది ప్రజలకు తేటతెల్లమైందని అన్నారు. ఓటర్లు ఇలాంటి నాయకులకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు.

Next Story

Most Viewed