కలెక్టర్ వద్దన్న కూడా అక్రమ నిర్మాణానికి డోర్ నెంబర్ మంజూరు చేసిన కార్యదర్శి

by Dishanational1 |
కలెక్టర్ వద్దన్న కూడా అక్రమ నిర్మాణానికి డోర్ నెంబర్ మంజూరు చేసిన కార్యదర్శి
X

దిశ, మనోహరాబాద్: అటు హెచ్ఎండీఏ, ఇటు గ్రామ పంచాయతీల అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్ వదలకుండా అక్రమంగా పరిశ్రమ నిర్మాణం కోసం ఏకంగా వందకు పైగా నిర్మిస్తున్న పిల్లర్లను ఇటు పోలీసులు, అటు ఎన్ ఫోర్స్ మెంట్ వారి ప్రొటక్షన్ తో కూల్చివేయాలని గత ఆగస్టు నెలలో హెచ్ఎండీఏ అధికారులు, సెప్టెంబర్ రెండవ వారంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా పంచాయతీ అధికారులు వారి ఆదేశాలను బేఖాతరు చేసిన వైనం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో చోటు చేసుకుంది.

కాళ్లకల్ ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఉన్న గ్లోబల్ అల్యూమినియం పరిశ్రమ యజమానులు యూనిట్ 2 పేర మరో భారీ పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సర్వే నెంబర్ 162 లోని 10-9 ఎకరాల స్థలంలో నిర్మాణం చేస్తున్నారు. ఇదే సర్వే నెంబర్ లోని 1-19 ఎకరాల వ్యవసాయ పొలం మర్రి వెంకటరాంరెడ్డి, సత్యనారాయణరెడ్డిల పేర ఉంది. ఈ పొలంకు ఆనుకుని సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణం చేపట్టడంతో ఇదేమిటని ప్రశ్నిస్తే పరిశ్రమ యజమానులు తిరగబడ్డారని వెంకటరాంరెడ్డి, సత్యనారాయణరెడ్డిలు వాపోయారు. ఈ అక్రమ నిర్మాణంపై జూన్ 2 న జిల్లా కలెక్టర్, గడా అధికారి, ఎంపీడీఓ, హెచ్ఎండీఏ, స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికలు పైఅధికారులకు పంపించారని తెలిపారు. ధీంతో హెచ్ఎండీఏ అధికారులు డీపీవోలు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు. కానీ పంచాయతీ అధికారులు వారి ఆదేశాలను బేఖాతరు చేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగస్టు నెలాఖరున మరోసారి జిల్లా కలెక్టర్ ను, డీపీవోను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ప్రొటెక్షన్ తో తక్షణమే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఈ నెల 15న ఆదేశాలు జారీ చేశారని వారు వివరించారు. పది రోజులు గడిచిపోయినా నేటికీ స్థానిక పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.

అక్రమ నిర్మాణానికి డోర్ నెంబర్ మంజూరా...?

ఓ పక్క జిల్లా కలెక్టర్, డీపీఓ, హెచ్ఎండీఏ అధికారులు అనుమతులు లేని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసినా... నిర్మాణం చేపడుతున్న పరిశ్రమకు ఎలాంటి ధరఖాస్తులు ఇవ్వకుండానే పంచాయతీ కార్యదర్శి గ్లోబల్ అల్యూమినియం యూనిట్ 2 పరిశ్రమకు 5-31/8/1/A డోర్ నెంబర్ ఎలా మంజూరు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే కార్యదర్శి డోర్ నెంబర్ అలాట్ చేయడం మర్మమేమిటని గుర్తుచేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


Next Story

Most Viewed