రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం

by Disha Web Desk 1 |
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం
X

మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘటన

దిశ, కౌడిపల్లి : కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గేట్ వద్ద మెదక్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు టాటా ఏస్ ఆటో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మెదక్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఢీకొనడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. డీఎస్పీ యాదగిరి రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సూరారం సాయిబాబా నగర్ కు చెందిన నాగలింగరాజు (36) అతని భార్య రమ (33) తోపాటు వెంకటలక్ష్మి, అమృత, వైశాలి, అవంతిక టాటా ఏస్ ఆటో వాహనంలో (TS15 UA8609) ఏడుపాయల వన దుర్గ భవాని దర్శనం చేసుకొని తిరిగి సూరారం వెళ్తున్నారు.

ఈ క్రమంలో కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఆటో నడుపుతున్న నాగలింగరాజు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయబోయి పల్లె వెలుగు బస్సును బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతని పక్కన కూర్చున్న భార్య రమా అక్కడికక్కడే దుర్మరణం చెందింది. నాగలింగ రాజు స్టీరింగ్ సీట్లోనే ఇరుక్కుపోయాడు.

భార్య రమా రోడ్డుపై పడిపోయింది. ఆటోలో వెనకాల కూర్చున్న వెంకటలక్ష్మి అమృత వైశాలి అవంతిక మరొకరికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదార్, కౌడిపల్లి ఎస్ఐ శివ ప్రసాద్ రెడ్డి, సిబ్బంది చేరుకున్నారు. ఆటోలో ఇరుక్కుపోయిన నాగలింగ రాజు మృతదేహాన్ని జేసీబీ, ప్రజల సహాయంతో బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం భార్యాభర్తల మృతదేహాలను ఆటోలో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులను కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కౌడిపల్లి వైపు వెళ్తున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి తూప్రాన్ డీఎస్పీ తో మాట్లాడారు. పల్లె వెలుగు బస్సు, ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆటో నడుపుతున్న నాగలింగరాజు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి బలంగా బస్సును ఢీకొన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పల్లె వెలుగు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed