బెంబేలెత్తిస్తున్న గ్రామసింహాలు.. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే దాడులే

by Disha Web Desk 12 |
బెంబేలెత్తిస్తున్న గ్రామసింహాలు.. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే దాడులే
X

దిశ, సంగారెడ్డి : గ్రామాన్ని రక్షించే గ్రామసింహాలు ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహాలుగా మారుతున్నాయి. విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కుక్కలు దాడులకు ఎగబడుతున్నాయి.జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్ వన్–1 మున్సిపాలిటీలో 38 వార్డులున్నాయి. ప్రతి వార్డులో కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగి పోవడంతో ఎక్కడ చూసినా రహదారులపై శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. కనబడిన వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా పోతున్నది. కుక్కల బెడదతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 38 వార్డుల్లో ప్రతి వార్డులో 20కి తగ్గకుండా కుక్కలు ఉన్నాయి. ఆయా వార్డుల్లో కాలనీవాసులు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ఉదయం వాకింగ్ కు వెల్తుంటే కుక్కలు దాడి చేసి గాయపర్చుతున్నాయి. వార్డుల్లోని మెయిన్ రోడ్లపై యదేచ్చగా సేదతీరుతున్నాయి. రోడ్డుపై ఒక్కరు కనిపిస్తే దాడులకు తెగబడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఓ వైపు హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కుక్కలు దాడి చేసి ప్రాణాలను హరిస్తున్న సంఘటనలు ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గ సభ్యులు క్కుల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

అయినా వాటిని లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలపై కుక్కలు దాడులకు పాల్పడుతూ ప్రాణాలు తీసేలా వ్యవహరిస్తున్నాయి. శనివారం సంగారెడ్డిలోని సంతోష్ నగర్ లో మధ్యాహ్నం ఓ యువతిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేయడంతో ఆ యువతికి ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రాణాలు తీసేవని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుక్కల నివారణకు ప్రత్యేక బడ్జెట్

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కుక్కల నివారణకు ప్రత్యేక బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రూ.లక్షల్లో నిధులు ఖర్చు చేస్తూ పట్టణంలోని కుక్కల బారి నుంచి కాపాడలేక పోతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వార్డుల్లో కుక్కలు మనుషులపై కుక్కలు దాడి చేసినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నట్లు నటిస్తూ ఆయా కాలనీలలో ఓ నాలుగైదు కుక్కలను పట్టుకుపోయి తిరిగి అదే వార్డుల్లో మున్సిఫల్ సిబ్బంది వదిలి వెళ్తున్నారు.

ఇదేంటి కుక్కలను తిరిగి వదిలివెల్తున్నారని ప్రశ్నిస్తే కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేశామని.. వాటికి మనుషులను కరిచినా ఏమీ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చాం ఇక ఏమి పర్వాలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఓ వైపు ప్రజలపై దాడులు చేస్తూ గాయపర్చుతుంటే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నివారణ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed