గడ్డపోతారంలో చిరుత కలకలం

by Dishafeatures2 |
గడ్డపోతారంలో చిరుత కలకలం
X

దిశ, అమీన్ పూర్: దండకారణ్యంలో కనిపించే చిరుత పులి జనారణ్యంలో ప్రవేశించి హల్చల్ చేసింది. ఎన్నో రోజులుగా కాజిపల్లి అభయారణ్యం నుండి చిరుత పులులు చుట్టుపక్కల గ్రామాలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. చాలా రోజుల నుండి పంట పొలాల్లో అప్పుడప్పుడు దర్శనమిచ్చిన చిరుత ఇప్పుడు ఏకంగా గడ్డపోతారంలోని హెటిరో పరిశ్రమలో దర్శనమిచ్చింది. శనివారం ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో చిరుత పులి పరిశ్రమలోనికి హెచ్ బ్లాక్ లోకి ప్రవేశించింది. చిరుత ప్రవేశించిన దృశ్యాలను సీసీ కెమెరా ద్వారా గుర్తించిన పరిశ్రమలోని ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో చిరుత ప్రవేశించిన సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకొని చిరుత ప్రవేశించిన హెచ్ బ్లాక్ ను మూసివేశారు.


మత్తు సూది ఇచ్చి చిరుతను బంధించిన సిబ్బంది

అనంతరం చిరుతను బంధించేందుకు సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్, జూ అధికారులు పూర్తి సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. మొదటగా మేకని ఎరగవేసి చిరుతను పట్టుకుందామని ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే చిరుత ఒకే గదిలో ఉండడంతో చిరుత బయటకి వెళ్లే మార్గం లేకపోవడంతో తమ నిర్ణయాన్ని మార్చుకొని మూడు వలలు పన్ని సహజంగా చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే చాలా గంటల రేస్క్యూ ఆపరేషన్ తర్వాత చిరుత ఉన్న గదిలో వాటర్ ప్రెషర్ ద్వారా చిరుత గన్ పాయింట్ లోకి వచ్చేలా చేసి గన్ షాట్ ద్వారా మత్తు సూదిని చిరుతకు ఇంజక్ట్ చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం చిరుతను బోన్ లో బంధించి నెహ్రు జూ పార్క్ కి తరలించారు. ఫారెస్ట్ అధికారులు జూ పార్క్ అధికారులు గంటల తరబడి శ్రమించి ఎట్టకేలకు చిరుతను బంధించడంతో పరిశ్రమ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.


అయితే ఈ చిరుత కాజీపల్లి అభయారణ్యం నుండి పరిశ్రమలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ శ్రీధర్ మాట్లాడుతూ.. తమ రికార్డుల ప్రకారం కాజీపల్లి అరణ్యంలో నాలుగు చిరుత పులులు, వాటి పిల్లలు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీరేంద్రబాబు, నెహ్రు జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి సరస్వతి, రిటైర్డ్ డిడి వెటర్నరీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story