కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టు రట్టు

by Disha Web Desk 15 |

దిశ, హత్నూర : కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీసీఎస్​, హత్నూర లోకల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో కృత్రిమ పాల తయారీ కేంద్రంను గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం గోవిందరాజ్ పల్లి గ్రామంలో బొమ్మ శంకరయ్యకు సర్వే నంబర్ 4,5 లో 3.23 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అందులో 30 గుంటలలో 70 ముర్ర జాతి ఆవులతో డైరీ ఫార్మ్ నడుపుతున్నాడు. అందులో ఏడుగురు బీహార్ కార్మికులు కూలీలుగా పనిచేస్తున్నారు. బొమ్మ శంకరయ్య, అతని కొడుకు రాఘవేందర్ తప్పుడు మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలని దురాశతో ఇద్దరు బీహార్ కార్మికుల సహాయంతో పాల పౌడర్, రెండు లీటర్ల రజని ఆయిల్, రెండు లీటర్ల పాలతో టిర్రింగ్ ( మిక్స్) చేసి 30 లీటర్ల పాలను తయారు చేస్తున్నారు. ఇలా ఒకరోజుకు సుమారు 1800 లీటర్ల వరకు కల్తీ పాలను తయారు చేసి,

వాటిలో సుమారు 200 లీటర్ల ఆవుపాలతో కలిపి మొత్తం 2000 లీటర్ల పాలను డ్రైవర్ అరిగే వినయ్ కుమార్ సహాయంతో జోగిపేట్ లోని శ్రీ సాయి పాల కేంద్రంలో, నారాయణ్ ఖేడ్ లోని మిల్క్ లైన్ (జెర్సీ) పాల కేంద్రంలో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గత ఆరు నెలలుగా బొమ్మ శంకరయ్య, అతని కొడుకు రాఘవేందర్ లు కల్తీ పాల తయారీకి కావలసిన పాల పౌడర్, ఆయిల్ ను షాపూర్ నగర్ లోని అంబిక కిరాణం షాప్ నందు కొనుగోలు చేసి, ఇద్దరు బీహార్ కూలీలు, డ్రైవర్ అరిగే వినయ్ కుమార్ సహాయంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ కల్తీ పాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెర్వు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ ఫరీన్ షేక్, జిన్నారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిషోర్, హత్నూర ఎస్ఐ సుభాష్, సీసీఎస్​ ఎస్ఐ సాయిలు, లాల్ అహ్మద్, ఏఎస్ఐ దుర్గారెడ్డి, మాణిక్ రెడ్డి, హెచ్సీ రేఖ్య, అన్వర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed