లోకల్ లీడర్లపై ప్రధాన పార్టీల ఫోకస్

by Disha Web Desk 12 |
లోకల్ లీడర్లపై ప్రధాన పార్టీల ఫోకస్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: పోలింగ్‌కు మరోపక్షం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు దిగువ శ్రేణి నాయకులపై దృష్టిని సారించారు. సొంత పక్షానికి చెందిన వారు పక్క పార్టీల్లోకి వెళ్లకుండా చూసుకోవటంతోపాటు అవతలి పక్షాలకు చెందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి ఇదే సువర్ణావకాశం అని భావిస్తున్న దిగువ శ్రేణి నాయకులు పలువురు తమకు ఎవరు ఎక్కువగా ముట్ట చెబితే వారికి అనుకూలంగా పని చేస్తున్నారు. ఇలా కొందరు ఇతర పార్టీల్లో ఉండి లోపాయికారిగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కోసం పని చేస్తుండటం గమనార్హం.

అత్యధిక స్థానాల్లో టఫ్ ఫైట్..

ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ పై గురిపెట్టిన బీఆర్ఎస్ తో పాటు ఈ సారి విజయం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆయా సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని అత్యధిక శాతం అసెంబ్లీ స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు ఎలాగైనా సరే గెలుపు సాధించాలని అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం అడ్డూ అదుపు లేకుండా డబ్బు, మద్యం, గిఫ్టులు పంచి పెడుతున్నారు. అదే సమయంలో దిగువ శ్రేణి నాయకులు చేజారి పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్యాకేజీలు..

ఎన్నికల సమరంలో దిగువ శ్రేణి నాయకుల పాత్ర కీలకమైందన్న విషయం అందరికీ తెలిసిందే. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలతో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గాల ఇన్చార్జిలు తమ తమ ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిత్యం జనాల్లోనే ఉండే నేపథ్యంలో ఓటర్లతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ కారణం వల్లే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులు వీరిపై దృష్టిని సారించారు.

వార్డు మెంబర్లకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు, సర్పంచులకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు రూ. 4 నుంచి రూ. 6 లక్షల ప్యాకేజీలను అభ్యర్థులు ఆఫర్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రత్యర్థి పార్టీలకు చెందిన దిగువ శ్రేణి నాయకులను సైతం తమ వైపు తిప్పుకోవడానికి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేయడం. ఫోన్‌లలో సంప్రదింపులు జరుపుతూ తమకు సహకరిస్తే ఎన్నికల్లో గెలిచిన తరువాత మీ పనులు చేసి పెడతామని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బెదిరింపులు సైతం..

ఇదిలా ఉండగా తమతో బేరసారాలు మాట్లాడడానికి వస్తున్న వారిలో కొందరు దిగువ శ్రేణి నాయకులు మీకు అనుకూలంగా పని చేసేది లేదని తేల్చి చెబుతున్నట్టు సమాచారం. నమ్మిన పార్టీకి ద్రోహం చేయలేమని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటివారిని కొందరు అభ్యర్థులు బెదిరిస్తున్నట్టుగా తెలియవచ్చింది. ముఖ్యంగా మరోసారి గెలుపు మాదే అన్న ధీమాతో ఉన్న అభ్యర్థులు ‘ఎన్నికల్లో మీవాడు ఎలాగూ గెలవడు.. గెలిచేది మేమే.. ఆ తర్వాత మీ సంగతి చూస్తా’ అంటూ హెచ్చరిస్తున్నట్టుగా సమాచారం.

ఇదే అవకాశంగా..

అభ్యర్థులు పోటీ పడుతూ ప్యాకేజీలతో ముందుకు వస్తున్న నేపథ్యంలో కొందరు దిగువ శ్రేణి నాయకులు తమ వద్దకు వస్తున్న వారిలో ఎవరు ఎక్కువ మొత్తంలో ప్యాకేజీ ఇస్తే వారికే అనుకూలంగా పని చేస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారికి అభ్యర్థులు అడ్వాన్సులుగా కొంత నగదును కూడా చెల్లిస్తున్నట్టు సమాచారం. రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల పోరులో విజయం కోసం అభ్యర్థులు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రజా తీర్పు ఎవరి వైపు ఉండనున్నదన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.



Next Story

Most Viewed