నీళ్లు పంచడానికే చేతగానోళ్లు దేశాన్ని ఉద్దరిస్తారా: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
నీళ్లు పంచడానికే చేతగానోళ్లు దేశాన్ని ఉద్దరిస్తారా: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నీళ్లు పంచడానికే చేతగానోళ్లు దేశాన్ని ఉద్దరిస్తారా అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం ప్రభుత్వ పాలకులపై మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ వనజ, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్ష లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విభజన హామీలను అమలు చేయకుండా కృష్ణ, గోదావరి నది జలాల్లో తెలంగాణ నీటి వాటాను తేల్చకుండా తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఇదిరా నా తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. దేశవ్యాప్తంగా యాసంగిలో 95 లక్షల ఎకరాల్లో సాగు అయితే, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల 44 వేల ఎకరాల్లో సాగు అయిందని ఇది తెలంగాణ వ్యవసాయ రంగ ఖ్యాతి అని తెలిపారు. కర్ణాటకలోని ఉత్తరభాగం, మహారాష్ట్రలోని పశ్చిమ భాగం, గుజరాత్ రాష్ట్రంలో సగానికి సగం బీడు భూముల ప్రాంతాలు ఉన్నాయన్నారు. రైతులను ఆర్థికంగా ఇబ్బంది చేసే వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే ఏడాది పాటు రైతులు ప్రతిఘటించడంతో ముక్కు చెంపలు వేసుకుని వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలన్న సోయి కేంద్రానికి లేదన్నారు.

ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ అతి పురాతనమైందని మొత్తం పదకొండున్నర ఎకరాల్లో గంజ్ 47 షాపులతో ఉందన్నారు. గత ఏడాది మార్కెట్ యార్డ్ లక్ష్యం రూ. 3 కోట్లు ఉంటే రూ. 4 కోట్ల 30 లక్షలు వసూలు అయిందన్నారు. ఈ ఏడాది మార్కెట్ యార్డ్ లక్ష్యం రూ. 3 కోట్ల 60 లక్షలు ఉంటే దీనిని రూ.5 కోట్లకు పూర్తి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు.

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మొసటి జ్యోతి మాట్లాడుతూ జయమ్మచెరువు నింపాలన్నా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలను సహకారం చేసేందుకు సహకరించాలని వేదిక నుంచి ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందుగా నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, షాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మన్నెలక్ష్మీ కాంత్ బీఆర్ఎస్ పేట మండల అధ్యక్షుడు వేపూరి రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story