అయిజలో అంతరాష్ట్ర బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదెన్నడో..?

by Disha Web Desk 23 |
అయిజలో అంతరాష్ట్ర బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేదెన్నడో..?
X

దిశ,అయిజ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అయిజ అతిపెద్ద మండలం. అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులో అయిజ మండలం ఉండటం వల్ల వ్యాపారపరంగ ఇక్కడ ప్రతినిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. నడిగడ్డ గా పిలువబడే గద్వాల జిల్లాలో రాజకీయంగా ఎంతో చైతన్యం అయిన మండలం కూడా అయిజ అనే చెప్పుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అయిజ పట్టణ కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జి పనులు మాత్రం ఏడాదిగా నత్తనడకన సాగుతున్నాయి. అయినా పట్టించుకునే వారే లేరన్నట్లుగా ఇక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తుంది.

అసలేం జరుగుతుంది..

ఏడాది క్రితం అయిజ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గాను ప్రభుత్వం రూ,7 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులను దక్కించుకున్న గుత్తేదారులు ఆరు నెలలు వేగవంతంగా పనులు చేసి బ్రిడ్జి స్లాబ్ వేశారు. ఆ తర్వాత అధికారుల అలసత్వం, నాయకుల పట్టింపులేని కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా జరగడం మొదలయ్యాయి. నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జికి ఆనుకుని ఒకవైపు కరెంట్ లైన్, మరోవైపు మంచి నీటి పైపులైన్ ఉన్నాయి. మూడు నెలల క్రితమే సంబంధిత గుత్తేదారు కరెంట్ లైన్, మంచి నీటి పైపులైన్ లను బ్రిడ్జి నిర్మాణానికి దూరంగా మార్చాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నెల, రెండు నెలలు, మూడు నెలలు గడిచినప్పటికీ ఈ రెండు పనులను అధికారులు చేసి పెట్టకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

అంతరాష్ట్ర ప్రయాణాలకు ఈ బ్రిడ్జె దిక్కు...

అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మిస్తున్న బ్రిడ్జి అంతరాష్ట్ర ప్రయాణాలకు నెలవుగా ఉంది. కర్ణాటకలోని రాయచూరు, బళ్లారి, బెంగుళూరు లాంటి ముఖ్య పట్టణాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం లాంటి పెద్ద పట్టణాలకు అయిజ మీదుగా ప్రయాణం చేయాలంటే ఈ బ్రిడ్జి మీదుగా వెళ్ళాలి. అయిజ నుంచి గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాలన్నా ఈ బ్రిడ్జి మీదుగానే ప్రయాణం తప్పనిసరి. ప్రస్తుతం ఏడాది కాలంగా పెద్దవాగుపై బ్రిడ్జీ నిర్మాణ పనులు జరుగుతుండటం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్లే వాహనాలు, ప్రజలు, ప్రయాణించేందుకు అధికారులు ప్రభుత్వ పశు వైద్యశాల ముందు కేవలం పది ఫీట్ల రోడ్డును ప్రత్యామ్నాయ రోడ్డుగా ఏర్పాటు చేశారు.

వ్యాపార కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందిన అయిజ పట్టణానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే కాక గద్వాల జిల్లాలోని గట్టు, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి, ఇటిక్యాల, మండలాల నుండి ప్రతిరోజు వివిధ వ్యాపార అవసరాల కోసం అయిజకు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ క్రమంలో ఇరుకుగా ఉండే ఈ ప్రత్యామ్నాయ రోడ్డుపై ప్రతిరోజు వాహనాల రాకపోకలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. పాదచారులు మాత్రం మరీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేదేమీ లేక మహిళలు, వృద్ధులు,చిన్న పిల్లలు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జీ పైనే రాళ్ళ సాయంతో ప్రమాదకర పరిస్థితుల్లో బ్రిడ్జీని దాటుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. మూడు నెలలుగా బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయి ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం : ప్రగతి, ఆర్ అండ్ బీ ఈఈ, గద్వాల్

అయిజలోని పెద్దవాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటాం. కరెంట్ లైన్, పైపులైన్ మార్చేందుకు ఆదేశాలు జారిచేశాం. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం.


Next Story

Most Viewed