కాంగ్రెస్ ను వీడిన మంద … బీఎస్పీలో చేరేందుకు ఢిల్లీ పయనం

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ ను వీడిన మంద … బీఎస్పీలో చేరేందుకు ఢిల్లీ పయనం
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్ కర్నూల్ ఎంపీగా నాలుగుసార్లు గెలుపొంది రికార్డు సృష్టించి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో అధికార పార్టీ ప్రతినిధిగా పని చేసిన డాక్టర్ మంద జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మంగళవారం వెల్లడించారు. 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అదే పార్టీ నుండి మూడు సార్లు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి ఓటమిపాలు అయ్యారు.

అనంతరం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని అప్పగించింది . గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు గాని, తన కుమారుడికి గాని అవకాశం కల్పించాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులకు అప్పట్లో పదేపదే విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయింది.

కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ , ఇతర ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా మంద జగన్నాథం ను ఆహ్వానించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో బీ ఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సంపత్ కుమార్ ఓటమిపాలు అయ్యారు. ఎన్నికల అనంతరం పార్టీలో చేరిన మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తదితరులకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కలేదు.

నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలి అని అధిష్టానాన్ని కోరిన ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మంద జగన్నాథం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు దిశకు తెలిపారు. బుధవారం ఉదయం బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరి ఎంపీగా పోటీ చేస్తాను అని జగన్నాథం తెలిపారు.


Next Story

Most Viewed