పులిగుట్ట మైనింగ్ ఆపండి.. అమడబాకుల గ్రామస్తుల ఆందోళన

by Disha Web Desk 11 |
పులిగుట్ట మైనింగ్ ఆపండి.. అమడబాకుల గ్రామస్తుల ఆందోళన
X

దిశ, కొత్తకోట: కొత్తకోట మండలం అమడబాకుల గ్రామ శివారు సమీపంలోని పులిగుట్ట వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులిగుట్ట మైనింగ్ ఆపేయాలంటూ మైనింగ్ వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మైనింగ్ కంపెనీకి సంబంధించిన కంటైనర్ కు నిప్పు పెట్టి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అమడబాకుల గ్రామ సమీపంలో ఉన్న పులిగుట్టలో మైనింగ్ తవ్వకాలు చేపడితే గ్రామానికి సమీపంలో గల ఎనుగొండ రిజర్వాయర్, మోడల్ స్కూల్ సబ్ స్టేషన్ ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ గడువు ముగిసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై సహజ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

కలెక్టర్ వచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మూడు రోజుల్లో తమ సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉదృతంగా ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుచ్చన్న, పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్, కొత్తకోట బీజేపీ నాయకులు కొమ్ము భరత్ భూషణ్, బాల మణెమ్మ, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed