ప్రకృతి ప్రేమికులకు త్వరలో సలేశ్వరం నిత్య దర్శనం

by Disha Web Desk 11 |
ప్రకృతి ప్రేమికులకు త్వరలో సలేశ్వరం నిత్య దర్శనం
X

దిశ, అచ్చంపేట : నల్లమల్ల అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో అతి పురాతనమైన 24 పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వాటిలో అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో పేరొందినది సలేశ్వరం లింగమయ్య ఒకటని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి అన్నారు. మంగళవారం జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల ఈసీ సెంటర్లో స్థానిక మీడియాతో ఇస్తా గోష్టిగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22, 23 తేదీలలో మాత్రమే సలేశ్వరం జాతరకు అనుమతులు ఉన్నాయని తెలిపారు.

దీనిని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు ప్రకృతి ప్రేమికులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ప్రస్తుత ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎక్కువ రోజులు భక్తులకు సెక్యూరిటీ ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో ప్రధానంగా వన్యప్రాణి పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అందుకు భక్తులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

త్వరలో నిత్య దర్శనం..

ప్రతి ఏడాది మే నెలలో నిండు పౌర్ణమి నాడు సందర్భంగా నల్లమల్ల అడవి ప్రాంతంలో చెంచుల సంస్కృతి సంప్రదాయాలతో జరిగే సలేశ్వరం జాతర ఉత్సవాలు ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నాయని, ఈ సమయంలో కాకుండా ప్రతి ఏడాది సుమారు తొమ్మిది నెలల పాటు ప్రకృతి ప్రేమికులు యాత్రికులు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం సలేశ్వరం ప్రాంతాన్ని సందర్శించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అందుకు సంబంధించిన ఏర్పాట్లు విషయంపై అటవీశాఖ వైల్డ్ లైఫ్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని గుర్తు చేశారు.

తద్వారా చెంచు నిరుద్యోగ యువతతో పాటు మన్ననూర్ గ్రామంలో కూడా వివిధ రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నాలుగైదు రోజులలో వచ్చే ఆర్థిక వనరుల కోసం ప్రాధాన్యత ఇచ్చే దానికంటే శాశ్వత ఆర్థిక వనరులు పెంచుకునేలా కృషి చేస్తున్నామని అందుకు మీడియా ఈ ప్రాంత ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సలేశ్వరం నిత్య దర్శనానికి మే లేదా జులై నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మందనూర్ అటవీ క్షేత్ర అధికారి ఈశ్వర్, ఉప క్షేత్ర అధికారి రవికుమార్ లు ఉన్నారు.


Next Story