దిశ వార్తకు స్పందన.. బాలింత కల్పనా మృతిపై విచారణ చేపట్టిన హెల్త్ కమిషన్

by Disha Web Desk 23 |
దిశ వార్తకు స్పందన.. బాలింత కల్పనా మృతిపై విచారణ చేపట్టిన హెల్త్ కమిషన్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన కల్పన అనే గర్భిణీ స్త్రీ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వలన మృతి చెందింది. ఆ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి 'దిశ ' కథనం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందుకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం నుండి గురువారం జరిగిన సంఘటనపై కమిషనర్ కార్యాలయం రాష్ట్ర ప్రోగ్రాం అధికారిని డాక్టర్ వి కే సుమిత్ర అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాము నిజనిర్ధారణ కోసం బాధిత కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన కల్పన భర్త ఆంజనేయులు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లిన సమయం నుండి తన భార్య చనిపోయేంత వరకు జరిగిన విషయాలను పై అధికారులకు ఉన్నది ఉన్నట్టుగా వివరించారు.

విధుల్లో ఉన్న డాక్టర్ తేజశ్రీ వారికి ఉన్న ప్రైవేటు వైద్య కేంద్రంలో మా భార్య చూయించుకోలేదన్న అక్కసుతోనే ప్రసవం చేయకుండా నిరాకరించిన నేపథ్యంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, తదుపరి పరిణామాల కారణంగా.. ఆశా వర్కర్, ప్రభుత్వ వైద్యులు ఆడిన నాటకం తో పాటు ప్రైవేటు వైద్యుల నిర్వాకం వెరసి నా భార్య మృతికి కారకులు అయ్యారని అధికారులకు వివరించారు. ఒకపక్క పుట్టగానే తల్లి దూరమైన పసిబిడ్డ, ఆ బిడ్డను చూసుకోవడానికి కుటుంబంలో ఉన్నవారు వృద్ధులుగా ఉండడం ఆ పసిబిడ్డ ను సముదాయించడం ఎలాగో అర్థం కావడం లేదని తండ్రి ఆంజనేయులు ఆవేదన వ్యక్తపరిచారు.

సంఘటనపై కమిషనర్ సీరియస్..

అచ్చంపేట ప్రాంతానికి చెందిన కల్పన అనే బాలింత వైద్యుల నిర్లక్ష్యం తో మృతి చెందిన సంఘటనపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ సీరియస్ అయ్యారని, దిశ పత్రిక ద్వారా వార్త వెలుగులోకి వచ్చిందని అందుకు కమిషనర్ క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని సూచించడంతో విచారణ చేపడుతున్నామని రాష్ట్ర హెల్త్ కమిషనర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుమిత్ర తెలిపింది. ఇటీవల అచ్చంపేట ప్రాంతం నుండి వైద్య సేవల నిర్లక్ష్య వైఖరి పై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఉన్నత స్థాయి అధికారులతో రివ్యూ సమావేశం కూడా ఉంటుందని ప్రభుత్వం మాతా శిశు మరణాలను తగ్గించాలని కృషి చేస్తున్న క్రమంలో అచ్చంపేట లాంటి ప్రాంతాల్లో సంఘటనలు పునరావృతం అవుతున్నందుకు గల కారణాలను అధ్యయనం చేసి అందుకు బాధ్యులైన వారిపై కమిషనర్ తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు.


Next Story

Most Viewed