దిమ్మెలు కడతారు.. టెంకాయలు కొడతారు.. పనులు చేయరా

by Disha Web Desk 20 |
దిమ్మెలు కడతారు.. టెంకాయలు కొడతారు.. పనులు చేయరా
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : దిమ్మెలు కడతారు.. టెంకాయలు కొడతారు తప్ప పనులు చేయరని ఆర్ అండ్ బీ అధికారి రాములును మద్దూరు జెడ్పి టీసీ రఘుపతి రెడ్డి నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్న బాలింతలకు ఆర్థిక సహాయం డబ్బులు ఏడాది గడిచిన రావడంలేదని.. మిషన్ భగీరథ నల్ల కలెక్షన్లు ఇప్పటికి కొన్ని మండలాల్లో ఇవ్వడం ఇవ్వలేదని... మద్దూరు నుండి భూనీడ్ వరకు బీటీ రోడ్డు పనులు ఇంకెప్పుడు ప్రారంభిస్తారని పలువురు నారాయణపేట, మద్దూర్ జెడ్పిటీసీలు అంజలి, రఘుపతి రెడ్డి, దామరగిద్ద ఎంపీపీ బక్క నర్సప్ప అధికారులను నిలదీశారు. జిల్లా కేంద్రంలోని సింగారం స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రంలో జెడ్పీ చైర్ పర్సన్ వనజ అధ్యక్షతన జెడ్పి సర్వసభ్య సమావేశం జరిగింది.

సర్వసభ్య సమావేశం ప్రారంభం కంటే ముందు గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ అకాల మరణం పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, విద్యుత్ శాఖ నివేదికను అధికారులు చదివి వినిపించారు. జెడ్పీ సమావేశానికి విద్యాశాఖ జిల్లా అధికారి ఎప్పుడు రాడని నోటీసు ఇవ్వాలని జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆదేశించారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారి వీణావాణి జెడ్పీ కో ఆప్షన్ వాహీద్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ జిల్లాలో అక్కడక్కడ చిరుత పులులు సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వీటిని గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉట్కూరు, మాగనూరు, కృష్ణ మండలాల్లో పంటను జింకలు నాశనం చేస్తున్నాయని జింకల సంరక్షణ కోసం ఇప్పటికే 70 ఎకరాలకు పైగా స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం జింకల తరలింపు అంశం పరిశీలనలో ఉందని అనుమతులు రాగానే పంటలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా వైద్యాధికారి రామ్ మనోహర్ రావు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గడిచిన 3 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 1371 కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 275 ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగాయన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో 2,56,348 మందికి కంటి పరిక్షలు చేయడం జరిగిందన్నారు. జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ రంజిత్ మాట్లాడుతూ 2023 జనవరి నుంచి జూన్ వరకు జిల్లా ఆసుపత్రికి 63 వేల 387 మంది ఔట్ పేషన్స్ జరిగిందనీ, 632 మేజర్ ఆపరేషన్లు, 924 సాధారణ 724 సిజరిన్ ఆపరేషన్లు చేశారన్నారు. అలాగే 2 లక్షలకు పైగా ల్యాబ్ టెస్టులు చేశారన్నారు. మద్దూరు జెడ్పిటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ మద్దూర్ నుంచి భూనీటి వరకు రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేశారని ఆర్ అండ్ బీ అధికారిని నిలదీశారు. కొల్లంపల్లిలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ పూర్తయిందని వెంటనే ప్రారంభించాలని కో ఆప్షన్ తాజుద్దీన్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అందడం లేదని నారాయణపేట జడ్పీటీసీ అంజలి ప్రశ్నించారు. మాగనూరు ఊట్కూరు పీఎస్ఎల్ లో పనిచేసే డాక్టర్లు తమకు ఈ ఉద్యోగం వద్దు అంటూ రిజైన్ చేసి వెళ్తున్నారని జిల్లా వైద్యాధికారి సభా దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు పలు సమస్యల పై అధికారులను వివరణ కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జడ్పీ వైస్ చైర్మన్ సురేఖ, జెడ్పీ సీఈవో జ్యోతి, ఏఎంసీ చైర్పర్సన్ మోసటి జ్యోతి, జడ్పీటీసీలు లావణ్య, సూర్యప్రకాష్ రెడ్డి, అంజనమ్మ, వెంకటయ్య, జిల్లా అధికారులు గోపాల్ నాయక్, జాన్ సుధాకర్, హతిరాం, వీణవాణి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed