పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జాప్యానికి కాంగ్రెస్సే కారణం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Disha Web Desk 11 |
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జాప్యానికి కాంగ్రెస్సే కారణం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజక్ట్ నిర్మాణం పనులు ఆలస్యం కావడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల తీరే ప్రధాన కారణం అని జడ్చర్ల ఎమ్మేల్యే సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి హరిజన వాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసుల వల్లే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఏ ప్రభుత్వాలు అయినా సరే అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజలకు మేలు చేసే పనులు చేపడుతుంటే ప్రతిపక్షాలు సహకరించాలి కానీ కేసులు వేస్తూ ప్రజలను రెచ్చగొడుతూ అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.

ఇటీవల కొందరు పోలిటికల్ టూరిస్టులు జిల్లాలో పర్యటిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై అవాకులు, చవాకులు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనుల కంటే ముందుగానే సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనులకు అధిక ప్రాధాన్యత కల్పించారని అన్నారు. దీన్ని చూసి జీర్ణించుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు. గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్రంగా కేసులు వేసి పనులను నిలువరించారని తెలిపారు. ఇది కాక 2013 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయంలో ప్రజలను రెచ్చగొట్టి కోర్టులో కేసులు వేయించారని తెలిపారు.

ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో ఆలస్యం జరిగిందని, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ నేతలే అని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 5000 పైచిలుకు ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని వారిలో 90% మంది రైతులకు పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించిందని, పలు గ్రామాల్లోని 3 వేలకు పైగా ఇండ్లు గ్రామస్తులు కోల్పోయారని వారి పరిహారం కొరకు ఆర్ఎన్ఆర్ లిస్టు కూడా పూర్తి అయిందని ఆ పరిహారం కూడా అతి త్వరలో బాధితుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకుల తీరును వారి వ్యవహార శైలిని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలను వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఓట్ల కోసం ప్రభుత్వం పట్ల తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

27న ఆస్పత్రి ప్రారంభం..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని గంగాపూర్ రోడ్డులో రూ. 33 కోట్లు వ్యయంతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ నెల 27న ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. దీని వల్ల నియోజకవర్గ పరిధిలోని అనేక మండలాలు, గ్రామాలకు చెందిన పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, మార్కెట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్ రెడ్డి, ఉమా శంకర్ గౌడ్, చైతన్య, చౌహన్ రమేష్, నందకిషోర్ గౌడ్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, బాద్మి రవిశంకర్, ఇంతియాజ్ ఖాన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టల మురళి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed