జూరాలకు జలకళ

by Aamani |
జూరాలకు జలకళ
X

దిశ,గద్వాల: సాగు, తాగునీటి కోసం గత యాసంగిలో నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డ నడిగడ్డ ప్రజలకు వరుణదేవుడి కరుణతో ముందస్తు వర్షాలు మురిపించాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు కృష్ణా పరివాహక ప్రాంతాలు, జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వచ్చి నీరు చేరుతుండడంతో రోజు రోజుకూ ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. మంగళవారం జూరాల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 7,211 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల జలాశయంలో 5.547 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద రాకున్నప్పటికీ వర్షపు నీరు చేరికతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలకు గాను 5.547 టీఎంసీలు నీరు చేరడంతో మరో వారంలోగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు సంబరపడుతున్నారు. ఇప్పటికే జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా తాజాగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అదే విధంగా ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలకు గాను 22.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయంలో 37.646 టీఎంసీలకు గాను 24.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు ముందస్తుగా వర్షపు చేరికతో పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంటుండడంతో ఆయకట్టు రైతులు ముందస్తు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.



Next Story

Most Viewed