గుట్టలను మింగేస్తున్న మట్టి దోపిడీ దొంగలు..

by Disha Web Desk 12 |
గుట్టలను మింగేస్తున్న మట్టి దోపిడీ దొంగలు..
X

దిశ, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల పరిధిలో మట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సహజంగా ఆవరించి ఉన్న గుట్టలను మట్టి మాఫియా తవ్వి తరలించకపోతోంది. దీంతో జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద గుట్టలు తరిగిపోయి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇలా ఉండగా మట్టి మాఫియా కేటుగాళ్లు చెరువులను సైతం వదలడం లేదు. నీళ్లు అడుగంటిన చెరువులలో మట్టిని తవ్వి తీసుకుపోయి విక్రయించుకుంటున్నారు.

రాత్రి పగలు లేకుండా నిత్యం మట్టిని తరలిస్తున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జేసీబీ, ట్రాక్టర్ యజమానులు మామూళ్లతో అధికారులను మచ్చిక చేసుకోవడంతో కళ్ల ముందు గుట్టలు కరిగిపోతున్న తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

జిల్లాలో మట్టి దోపిడీ మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు అన్న చందంగా కొనసాగుతోంది. జేసీబీ, ట్రాక్టర్ యజమానులు ముఠాగా ఏర్పడి గుట్టలను మాయం చేస్తున్నారు. జేసీబీలతో ఇష్టానుసారంగా గుట్టలను తవ్వి విలువైన మొరం మట్టిని ట్రాక్టర్ల ద్వారా గృహ నిర్మాణ దారులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు అధికార పార్టీ నేతలు ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతుంది.

బలంగా మాఫియా నెట్‌వర్క్..

మట్టి దోపిడీకి పాల్పడుతున్న మాఫియా తమ నెట్ వర్క్ ను బలంగా తయారు చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని రోజు ఒక గుట్ట దగ్గర నుంచి మట్టిని తరలిస్తూ ఎవరైనా అధికారులు గానీ విలేకరులు గాని అటువైపు వస్తే వెంటనే తమ అనుచరుల ద్వారా సమాచారం తెలుసుకొని అప్రమత్తం అవుతున్నారు. ఎవరైనా కొత్తవారు గాని, పాత్రికేయులు గాని మట్టి తవ్వే దగ్గరికి వస్తే వారిని మాటల్లో పెట్టి గ్రామాలలో రోడ్ల కోసం తరలిస్తున్నామని తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇటీవల మట్టి మాఫియా చూపు చెరువులపై పడింది.

రాజనగరం సమీపంలోని అమ్మ చెరువులో అభివృద్ధి చేయడంలో భాగంగా నీటిని మొత్తాన్ని కిందికి వదిలివేయడంతో చెరువులో మట్టిని తరలిస్తూ విక్రయించుకుంటున్నారు. ఇటీవల మట్టిని తరలిస్తుండగా దిశ ప్రతినిధి వారిని ప్రశ్నించగా ఒండ్రుమట్టిని తరలించడానికి అధికారులు అనుమతి తీసుకున్నామని, పొలాలకు తీసుకుపోతున్నామని చెప్పారు. అదే సమయంలో అటుగా అప్పటి కలెక్టర్ వస్తున్నారని తమ అనుచరుల ద్వారా సమాచారం రావడంతో పరారయ్యారు. మళ్లీ గంట తర్వాత కలెక్టర్ వెళ్లిపోగానే యధావిధిగా మట్టి తరలింపు మొదలుపెట్టారు.

దీన్ని బట్టి చూస్తే ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి దోపిడికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాజనగరం శివారులో ఉన్న రెవెన్యూ గుట్టతో పాటు 200 సర్వేనెంబర్ సమీపంలో ఉన్న అటవీశాఖ గుట్టలను సైతం తవ్వి మట్టిని తరలించుకెళ్తున్నారు. ఈ తతంగం నిత్యం కళ్ళముందే జరుగుతున్నా, గుట్టలన్నీ కరిగిపోతున్న సంబంధిత రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

మట్టి దోపిడీపై పాత్రికేయులు అధికారులను వివరణ కోరినప్పుడు మాత్రం వారి హెచ్చరికలతో మట్టి మాఫియా రెండు రోజులు తరలింపు పనులకు బ్రేక్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ యధావిధిగా తవ్వుకుపోతున్నారు. రెండు రోజులు రాజనగరం అమ్మ చెరువులో తవ్వకాలు జరిపిన మట్టి మాఫియా తాజాగా శనివారం మళ్లీ రాజనగరం గుట్ట పై తవ్వకాలు చేపట్టారు.

మట్టి మాఫియా మీడియా వారిని పలు రకాలుగా మచ్చిక చేసుకొని వార్తలు రాయకుండా చూసుకుంటున్నారని, అందుకే మట్టి దోపిడిపై చాలా వరకు మీడియాలో వార్తలు రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో మట్టి దోపిడీని అరికట్టి సహజ వనరులను కాపాడడానికి నూతన జిల్లా కలెక్టర్ చొరవ చూపి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకొంటాం

వనపర్తి సమీపంలోని గుట్టలపై ఎవరైనా మట్టి తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకనుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తాం. మట్టి తరలింపు ఉంటే కేసులు నమోదు చేస్తాం. రాజానగరం గుట్టపై నిఘా పెడతాం.- రాజేందర్ గౌడ్ తహశీల్దార్ వనపర్తి



Next Story

Most Viewed