కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కర్ణాటక పరిస్థితే : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కర్ణాటక పరిస్థితే  : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్: కాంగ్రెస్‌ పాలనలో కర్ణాటకలో కటిక చీకట్లు అలుముకొన్నాయని,తెలంగాణలో ఆ పార్టీకీ ఓటేస్తే కర్ణాటక పరిస్థితే దాపురిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని పోతన్ పల్లి,మాచన్ పల్లి,రామచంద్రాపూర్ గ్రామాల్లో విస్త్రుతంగా ఇంటింటి ప్రచారం చేస్తూ,ప్రధాన కూడళ్ళలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ను గెలిపించి తాము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కన్నడ ప్రజలు లబోదిబోమంటున్నారని,అక్కడ రైతులకైతే పట్టుమని 5 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని ఆయన తెలిపారు.

కర్ణాటకలో కరెంట్ కష్టాలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్లలో మొసళ్లను తెచ్చి వదిలి నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాంటి కష్టాలు మనకు రాకుండా చేసిన సీఎం కేసీఆర్ కు మరోసారి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు కరెంటు బిల్లులు కట్టలేదని మోటార్లు లాక్కుపోయేవారని ఇప్పుడు అలాంటి పరిస్థితే లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు బంధు,బీసీ బంధు,దళిత బంధు, ఉచిత గొర్రెలను పంపిణీ చేస్తుంటే చూసి ఓర్వలేక ఆపేయాలని కాంగ్రెసోళ్లు ఫిర్యాదు చేశారని,రైతులు పేద ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ తీరుకు ఇది నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే పింఛన్ ను తిరిగి 200 రూపాయలు చేస్తారని మంత్రి ఆరోపించారు. ప్రతి పేద మహిళలకు 3 రూపాయల వేల భృతి అందించి పేదలకు అండగా నిలుస్తామని,జనవరి నుంచి వంటగ్యాస్ 400 రూపాయలకు,ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా కరివెన,ఉదండాపుర్ రిజర్వాయర్లు పూర్తి అయ్యాయని త్వరలోనే కాలువలు తవ్వి సాగునీటిని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.


Next Story