జూపల్లి వర్సెస్ బీరం.. హాట్ హాట్‌గా పరస్పర విమర్శలు

by Dishanational2 |
జూపల్లి వర్సెస్ బీరం.. హాట్ హాట్‌గా పరస్పర విమర్శలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు కొల్లాపూర్‌లో ఆసక్తి రేకిస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటా పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నారు. నువ్వా.. నేనా అనే రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే తండ్రి కాంట్రాక్టర్ గా నిర్మించిన బ్రిడ్జికి రూ. ఏడు లక్షలకు గాను ఏకంగా రూ. 26 కోట్లు తీసుకున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపణలు చేశారు.. దీంతోపాటు నియోజకవర్గంలోని పలు రకాల సమస్యలను గురించి మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్నారు.. ఒక అడుగు ముందుకు వేసి వచ్చే ఎన్నికలలో తేల్చుకుందాం అన్న విధంగా సవాల్ విసిరుతున్నారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సైతం తాను తక్కువ ఏమీ కాదు అన్న చందంగా మాజీ మంత్రిపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. జూపల్లి హయాంలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలు.. మిగిలిన పనులు తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇటు బీరం.. అటు జూపల్లి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.

సామాజిక మాధ్యమాల వేదికగా

ఒకవైపు మాజీ మంత్రి జూపల్లి, మరోవైపు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మధ్య మీడియా వేదికగా మాటల యుద్ధాలు సాగుతుండగా... సామాజిక మాధ్యమాల ద్వారా వారి వారి అనుచరులు సైతం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. జూపల్లి హయాంలో జరిగిన వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీరం అనుచరులు ప్రచారం చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 26 కోట్ల వ్యవహారాలు, పార్టీ మారిన అంశం, ఫామ్ హౌస్ ఘటన తదితరాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి వారి అభిమానులు ఒకరిని మించి మరొకరు సామాజిక మాధ్యమాలలో సాగిస్తున్న పోరు ఒక్కొక్కసారి శృతి మించిపోతున్నాయి. పత్రికలలో రాయని విధంగా భాషను ఉపయోగించుకుంటూ నేతల సంగతి అటు ఉంచి చివరకు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ ఆగ్రహాలను వ్యక్తం చేస్తున్నారు.

జూపల్లి పార్టీ మారితే మరింత రసవత్తరం..

అధికార పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా స్తబ్దతగా ఉన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా బీజేపీలలో ఏదేని ఒక పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం మాజీ మంత్రి ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోకి దిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. జూపల్లి తన అనుచర గణంతో ఏదైనా పార్టీలో చేరితే కొల్లాపూర్‌లో రాజకీయాలు మరింత రసవత్తరంగా కొనసాగనున్నాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


Next Story

Most Viewed