ప్రాజెక్టులపై అవగాహన లేని సీఎం కేసీఆర్ : Janardhan Reddy

by Disha Web Desk 7 |
ప్రాజెక్టులపై అవగాహన లేని సీఎం కేసీఆర్ : Janardhan Reddy
X

దిశ, జడ్చర్ల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టర్ల చేత ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నారని, భవిష్యత్తులో ప్రాజెక్టుల వల్ల ముంపు గ్రామాల ప్రజలకు నష్టం వాటిల్లితే సీఎం కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జడ్చర్ల పట్టణంలోని ఐబి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం మహబూబ్‌నగర్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై కొందరు సన్యాసులు కేసులు వేశారు అన్న వ్యాఖ్యాలపై జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని, నాడు ఉద్యమంలో పోలీస్ తూటాలకు.. నేడు ఆత్మబలి దానాలతో రాష్ట్రం సిద్ధించిందని ఆయన అన్నారు.

పాలమూరు ప్రజలను సీఎం కేసీఆర్ అడుగడుగున మోసం చేస్తున్నారని నార్లాపూర్ వద్దకే ఎల్ ఐ లిఫ్టు సమీపంలో కొద్దిదూరంలోని ఓపెన్ కట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్లాస్ట్‌తో మోటార్లు దెబ్బతింటాయని, దానిపై తాను కేసు వేశానని అంతే తప్ప ప్రాజెక్టులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. మరో వైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణ పనులల్లో ఇంజనీర్ల పాత్ర లేకుండా మొత్తం కాంట్రాక్టర్లకే అప్పగించడంతో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. వెంటనే ప్రాజెక్టుల నాణ్యతను పరిశీలించేందుకు ప్రభుత్వ ఐఐటి సివిల్ ఇంజనీర్లతో పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కే ఎల్ ఐ కాలువ విస్తీర్ణం పెంచడానికి నాలుగుసార్లు సీఎంకు తాను లేఖ రాశానని నేటి వరకు మోటార్ల సామర్థ్యం పెంచడమే తప్ప కాల్వ విస్తీర్ణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

నీటి వినియోగంపై ముఖ్యమంత్రికి అవగాహన లేదని కృష్ణానది నీటి వాటాలో 69% అంటే 299 టీఎంసీ నీటిని వాడుకోవాల్సి ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోలేదన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జూరాల ప్రాజెక్టు వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు డిజైన్ చేశామని అలా కాకుండా ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఏటా 35 రోజులపాటు రోజుకు అయిదు టీఎంసీల నీరు వృధాగా పోతుందని వివరించారు. న్యాయబద్ధంగా రావాల్సిన 574 టీఎంసీల నీరు రాష్ట్రానికి వస్తుందని అయినా దానిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్క వెంకటేశం, పట్టణ అధ్యక్షుడు మీనాజ్, బూర్ల వెంకటయ్య నాయకులు శ్రీనివాసులు, ఎన్ఎస్ యుఐ, జిల్లా నాయకుడు ఫహద్ తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed