2,500 మంది మహిళలకు చీర, ఒడిబియ్యం అందజేత

by Disha Web Desk 1 |
2,500 మంది మహిళలకు చీర, ఒడిబియ్యం అందజేత
X

దిశ, మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామంలోని దత్తాత్రేయ ఆలయ ఆశ్రమంలో గత ఐదు రోజులుగా కొనసాగిన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆలయ పీఠాధిపతి రంగనాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు పదివేల మంది భక్తులు ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మహిళా భక్తులకు 2,500 మందికి

పసుపు కుంకుమ, చీర, ఒడి బియ్యం అందజేసి ముత్తైదువులను అందరినీ ఆశీర్వదించారు. ఇలాంటి కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలో మొట్టమొదటి సారిగా నిర్వహించారని, వచ్చిన మహిళా భక్తులకు చీర ఇచ్చి ఒడి బియ్యం పోయడం చాలా సంతోషమని మహిళా భక్తులు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతి రంగనాయకులు మాట్లాడుతూ.. సరస్వతి ఆలయ నిర్మాణం చేపట్టడం చుట్టుపక్కల ఎక్కడా లేదని, భక్తుల కోసం అక్షర జ్ఞానం కలిగించేందుకు సరస్వతి ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

దత్తాత్రేయుడి కరుణా కటాక్షాలు, సరస్వతి దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని.. లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణం, చండీ హోమం, వినాయక పూజ, సరస్వతి దేవి పూజ, త్రినేతునికి అభిషేకం, రావి, వేప చెట్టుల వివాహాలను జరిపించామని ఆయన తెలిపారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆత్మలింగారెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది ప్రధాన పూజారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story