పెళ్లయిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం.. యువతి అనుమానాస్పద మృతి

by Disha Web Desk 4 |
పెళ్లయిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం.. యువతి అనుమానాస్పద మృతి
X

దిశ: దేవరకొండ: పెళ్లయిన వ్యక్తితో ప్రేమ వ్యవహారంలో యువతి అనుమానస్పద మృతి మిస్టరీగా మారింది. ఈ ఘటన బుధవారం దేవరకొండ మండలంలోని మైనంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చోటు చేసుకుంది. కొర్ర తండాకు చెందిన నేనావత్ మాన్సింగ్ రెండవ భార్య రంగి కుమార్తె నేనావత్ చిన్ని (18) ఆత్మహత్యపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. నేనావత్ చిన్ని గత రెండు సంవత్సరాల కిందట పదవ తరగతి చదివి ఇంటి దగ్గరనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కొర్ర విజయ్‌తో నాలుగు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలిసింది.

అప్పటికే విజయ్‌కి పెండ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా విజయ్‌పై చిన్ని ప్రేమ చంపుకోలేకపోయింది. తల్లిదండ్రులు ఇటీవల పెండ్లి సంబంధాలు చూస్తుండడంతో చిన్ని ఆందోళనకు గురయింది. తల్లిదండ్రులు చూసే సంబంధం ఇష్టం లేక చిన్ని మే 29న గ్రామం నుండి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో చిన్ని తల్లిదండ్రులు విజయ్ బుధవారం రోజు నిలదీశారు. తన దగ్గరికి వచ్చి తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారని, నన్ను పెళ్లి చేసుకోమని అడగగా! దానికి బదులుగా విజయ్ నాకు ఇప్పటికే పెండ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పినట్లు తెలిపాడు.

తల్లిదండ్రులు చూసే సంబంధాలు చేసుకోమని చిన్నికి నచ్చజెప్పి పంపించానని అన్నాడు. అయినా విజయ్‌పై ప్రేమ చంపుకోలేక చిన్ని అదే రాత్రి తన తండా దగ్గర్లో ఉన్న బావిలో దూకి చనిపోయి ఉండవచ్చునని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్ని బుధవారం గ్రామ సమీపంలోని బావిలో పడి మృతి చెందిందని గుర్తించిన తల్లిదండ్రులు చిన్ని మరణానికి విజయ్ కారణమని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పెళ్లి అయిన విజయ్‌కి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తన తల్లిదండ్రులు పెండ్లి చేయరేమోనన్న అనుమానంతో చిన్ని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా! లేక విజయ్ చిన్ని మరణానికి కారణమై ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని తల్లిదండ్రులు అంటున్నారు.

గ్రామానికి చెందిన విజయ తమ ప్రేమ వ్యవహారం ఎక్కడ బయట పెడుతుందో అనే అనుమానంతో తమ కూతురిని కొట్టి చంపి బావిలో వేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై న్యాయవిచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి మాన్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కస్తూరి సతీష్ తెలిపారు.

Next Story