ఐఏఎస్ రజత్ కుమార్‌పై చర్యలు తీసుకోండి.. సీఎస్‌కు లేఖ

by Disha Web Desk 4 |
ఐఏఎస్ రజత్ కుమార్‌పై చర్యలు తీసుకోండి..  సీఎస్‌కు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ఇంజనీర్ల ఫోరమ్ తరఫున రిటైర్డ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణ చేసిన ఫిర్యాదుకు స్పందనగా కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న డీవోపీటీ అండర్ సెక్రటరీ రూపేశ్ కుమార్ ఈ నెల 14న ఈ లేఖ రాశారు. రజత్ కుమార్ తన కుమార్తె పెళ్ళి కోసం చేసిన ఖర్చులన్నింటినీ మెగా ఇంజనీరింగ్ సంస్థ స్పాన్సర్ చేసిందంటూ వచ్చిన వార్తల ఆధారంగా దొంతుల లక్ష్మీనారాయణ జనవరి 29న కేంద్ర హోంశాఖకు, డీవోపీటీకి, ఎన్‌ఫోర్స్ rajatమెంట్ డైరెక్టరేట్‌కు, సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న డీవోపీటీ సీఎస్‌కు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ లేఖ రాసింది.

గత వారం సైతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ జనవరి 28న చేసిన ఫిర్యాదు మేరకు డీవోపీటీ అండర్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు మరో లేఖ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ సైతం రజత్ కుమార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడినందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీతో సహా కేంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంకా డీవోపీటీ స్పందించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపు కాంట్రాక్టులో హెచ్చు భాగం మెగా ఇంజనీరింగ్ సంస్థకే దక్కిందని, గ్లోబల్ టెండర్లను పిలవాల్సి ఉన్నప్పటికీ తక్కువ ధరను కోట్ చేసినందుకు ఈ సంస్థకే దక్కాయని దొంతుల లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న సమయంలో సైతం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి 12 లక్షల మంది యువ ఓటర్లను తొలగించినట్లు రజత్‌ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయని దొంతుల లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై విపక్షాలు ప్రశ్నించగా కేవలం క్షమాపణతో సరిపెట్టారని, ప్రభుత్వం నుంచి ప్రతిఫలంగా ఆయనకు విలువైన భూమి లభించిందన్న ఆరోపణలను కూడా లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న డీవోపీటీ ఆ ఫిర్యాదు నకలుతో పాటు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

Next Story

Most Viewed