ప్లాస్టిక్ రహిత తెలంగాణగా మారుద్దాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Disha Web Desk 13 |
ప్లాస్టిక్ రహిత తెలంగాణగా మారుద్దాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మారుద్దామని, ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ‌ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవంను పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో క‌లిసి జ్యోతి ప్రజ్వల‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టాల్స్ ను పరిశీలించారు.

పర్యావరణంపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మ‌న‌కు తెలియ‌కుండానే నిత్య జీవితంలో భాగ‌మై ఎన్నో వ్యాధులు, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న ప్లాస్టిక్ ఎంత ప్రమాద‌మో ప్రజ‌లు గుర్తించాల‌న్నారు. ప్రభుత్వ సంక‌ల్పం.. ప్రజ‌ల భాగ‌స్వామ్యంతోనే ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యమన్నారు. ప్లాస్టిక్ వ‌స్తువుల వినియోగం ప్రత్యామ్నాయ‌ పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ముందు వరసలో ఉన్నామ‌ని చెప్పారు.

భవిష్యత్ తరాల మనుగడ కోసం ఎంతో ముందు చూపుతో సీఎం పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహార కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ మార్గదర్శకుడయ్యారన్నారు. హరితహారానికి రూ.10 వేల కోట్లు వెచ్చించ‌డం జ‌రిగిందని తెలిపారు. జాతీయ, అంత‌ర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకున్నామ‌న్నారు. హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో రిజ‌ర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో అనేక అర్బన్ ఫారెస్ట్ పార్కుల‌ను అభివృద్ధి చేశామన్నారు. అవెన్యూ ప్లాంటేష‌న్ ద్వారా ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా మొక్కల‌ను నాటి సంరక్షిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండ‌లి పర్యావరణహితమైన కార్యక్రమాలకు రూపలకల్పన చేసి అమ‌లు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీసీబీ చైర్మన్ రాజీవ్ శర్మ, మెంబర్ సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed