రాజకీయ విబేధాలు పక్కన పెడదాం: ప్రతిపక్ష నేతలకు టీపీ చీఫ్ షర్మిల లేఖ

by Disha Web Desk 7 |
రాజకీయ విబేధాలు పక్కన పెడదాం: ప్రతిపక్ష నేతలకు టీపీ చీఫ్ షర్మిల లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ విబేధాలు పక్కనపెట్టి నిరుద్యోగుల పక్షాన పోరాటానికి ప్రతిపక్షాలంతా కలిసి రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, మంద కృష్ణ మాదిగ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఎన్ శంకర్ గౌడ్‌కు షర్మిల లేఖ రాశారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల తరుపున పోరాడే సమయం ఆసన్నమైందని ఆమె పేర్కొన్నారు. ఈ పోరాటానికి జాయింట్ యాక్షన్ కమిటీ చారిత్రక అవసరమని ఆమె లేఖలో పేర్కొన్నారు.

పలు పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా, ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా చేసే పోరాటాలను ఆమె అభినందించారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో చిక్కి, గుండెలు మండి, కడుపుకాలి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నియంత, మోసపూరిత ప్రభుత్వం చేసిన ద్రోహానికి కొన్ని తరాలు మొత్తం ఆహుతి కాబోతున్నాయని షర్మిల వెల్లడించారు. ఖాళీలు భర్తీ చేయకుండా కేసీఆర్ సర్కారు చేస్తున్న నీచ నాటకాలు ప్రతిపక్ష పార్టీలకు తెలిసింది కాదని, బిస్వాల్ కమిటీ సిఫార్సు ప్రకారం 1.91 లక్షల ఖాళీలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయాల్సిందేనని వెల్లడించారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం యువతను దారుణంగా ముంచిందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు పేపర్ లీకేజీ స్కాముతో విడుదల చేసిన నోటిఫికేషన్ల ఆశ కూడా అడుగంటిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కఠిన సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వారి వారి రాజకీయ విభేదాలను మరిచి చేతులు కలిపి, ఒక్క పోరాటవేదికపై చేరి, ఈ క్రూర పాలనపై పోరాడాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని ఆమె కోరారు. ఉమ్మడి కార్యాచరణను రూపొందించి మోసపోయిన నిరుద్యోగులకు అండగా నిలవాలని ఆమె లేకలో పేర్కొన్నారు. ఏ యువకుల, విద్యార్థులు త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర కాంక్ష నెరవేరిందో, ఏ యువత తమ రక్తాన్ని చిందించి తెలంగాణ తల్లికి అభిషేకం చేశారో, ప్రాణాలను నైవేద్యంగా అర్పించుకున్నారో, వారికోసం ప్రతిపక్ష నేతలుగా ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సిన ముహూర్తం ఇదేనన్నారు. తెలంగాణ భవిత, యువత కోసం కలిసి నడుద్దామని, నిలిచి పోరాడదామని షర్మిల లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed