IPL మొత్తం కమర్షియల్.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
IPL మొత్తం కమర్షియల్.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడలను కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారంగా మార్చారని, ఐపీఎల్ అంతా కమర్షియల్‌గా మారిందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ మాఫియా కారణంగా అమాయకులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కప్ పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందని అంతగా తెలంగాణ అభివృద్ధి చెందిందని తెలిపారు. క్రీడా రంగంలో కూడా వృద్ధి చెందిందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తెచ్చేందుకు సీఎం కప్ టోర్నమెంట్‌లను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని గెలిస్తే బాధ్యతగా ముందుగు వెళ్లాలని, ఓటమి గెలుపునకు నాంది అని, గెలిచే వరకు శ్రమించాలని పిలుపు నిచ్చారు.

ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, జింఖానా మైదానంలో మంత్రి మల్లారెడ్డి, గచ్చిబౌలిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రకటించబోయే నూతన క్రీడా విధానంలో సీఎం కప్‌ నిర్వహణ అంశాన్ని పొందు పరుస్తామని స్పష్టం చేశారు. సాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌ మాట్లాడుతూ.. సీఎం కప్‌ నిర్వహణ ఘట్టం క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని.. రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇది ఒక నూతన ఓరవడి అన్నారు.

రాష్ట్ర స్థాయిలో 6 స్టేడియాలు 18 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించామని, క్రీడల్లో పాల్గొనే వారికి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుందని గుడి, బడి లాగే మైదాన్‌ కూడా పవిత్ర స్థలాలా జాబితాలో చేరిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు నోముల భగత్, మాగంటి గోపినాధ్‌, నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ, సాట్స్‌ ఓఎస్‌డీ కె. లక్ష్మీ, డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, చంద్రారెడ్డి, అనురాధ, ఓలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జగదీష్‌ యాదవ్‌, రంగారెడ్డి డీవైఎస్‌ఓ వెంకటేశ్వరరావ్‌, ప్రేమ్‌రాజ్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed