జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం..? కాంగ్రెస్ సర్కార్‌పై KTR సీరియస్

by Satheesh |
జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం..? కాంగ్రెస్ సర్కార్‌పై KTR సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పరీక్షలు వాయిదా వేయడంతో పాటు పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ అభ్యర్థులు చేస్తోన్న ఆందోళనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూలో ఎందుకు ఇంత నిర్బంధమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓయూలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించమని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన.. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యమంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో మళ్లీ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు మళ్లీ అడగడుగునా దర్శనమివ్వటం చూస్తుంటే విద్యార్థులు మరో ఉద్యమంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఓయూలో అరెస్ట్‌ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్ట్ యూనియన్లు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed