మనీష్ సిసోడియా అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే

by Disha Web Desk 2 |
మనీష్ సిసోడియా అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టును మంత్రి కేటీఆర్ ఖండించారు. ప్రతిపక్షాలపై బీజేపీ దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని, దొంగచాటు రాజకీయాలను చేస్తున్నదని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈ చర్యలు గొడ్డలిపెట్టుగా మారాయని, ప్రజాబలంతో ఎదుర్కోలేక కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదన్నారు. బీజేపీ అసమర్ధ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక నీచంగా వ్యవహరిస్తున్నదని, ప్రశ్నించినవారిని అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నదని అన్నారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్నదని, పరాజయాన్ని ఎదుర్కొన్నదని, దీన్ని తట్టుకోలేక సిసోడియాను అరెస్ట్ చేయించిందన్నారు.

బీజేపీ నీతి బాహ్యమైన, దుర్మార్గ రాజకీయాలను దేశం గమనిస్తున్నదని, దాని కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందన్నారు. ప్రజాబలం లేకపోవడంతో దొడ్డిదారిన రాజకీయాలు చేస్తున్నదని, అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిందని, ప్రలోభాలకు లొంగక ఎదురొడ్డి నిలిచిన పార్టీలను దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి భంగపడిందని గుర్తుచేశారు. ఆ పార్టీ అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత కుట్రలకు కాలం దగ్గర పడిందన్నారు.



Next Story

Most Viewed