కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి మరొకరు.. ఆ పార్లమెంట్ నియోజకవర్గంపై కర్ఛీఫ్?

by Disha Web Desk 2 |
కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి మరొకరు.. ఆ పార్లమెంట్ నియోజకవర్గంపై కర్ఛీఫ్?
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ నాయకుల వారసులు, బరిలో నిలవాలనుకునే ఆశావహులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం నుంచి పోటీ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి భట్టి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తి తెరమీదకు వచ్చి భువనగిరి నుంచి పోటీ చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు. ఆదివారం కోమటిరెడ్డి పవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి అంటే ఒక బ్రాండ్ అని.. మా కుటుంబం మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉందని అన్నారు. అందుకే తాను కూడా ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్నానని.. తన కుటుంబసభ్యుల సహకారంతోనే భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. భువనగిరి కాంగ్రెస్‌కు కంచుకోట అని.. భారీ మెజార్టీ తీసుకొస్తానని ప్రకటించారు. కోమటిరెడ్డి సోదరుల పెద్ద అన్న అయిన కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడే ఈ పవన్ రెడ్డి.


ఇప్పటికే భువనగిరి నుంచి 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎంపీలుగా విజయం సాధించారు. ఈ పార్లమెంటు నియోజక వర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గట్టిపట్టు ఉంది. నియోజకవర్గంలో కోమటిరెడ్డి కుటుంబానికి బలమైన క్యాడర్‌తో పాటు బలమైన బంధు వర్గం ఉంది. 20 ఏళ్లుగా డాక్టర్‌గా సేవలు అందిస్తున్న సూర్య పవన్ రెడ్డికి మంచి పేరుంది. అంతేకాకుండా.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో జనగామ మినహా నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజక వర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ రెడ్డి భువనగిరిపై కన్నేశారు. మరి అధిష్టానం ఏ నిర్ణక్ష్ం తీసుకుంటుందో చూడాలి.

Next Story

Most Viewed