ఇక్కడ నేను చెప్పిందే వేదం.. కార్మికులంతా నా కనుసన్నల్లో పని చేయాలి

by Disha Web Desk 12 |
ఇక్కడ నేను చెప్పిందే వేదం.. కార్మికులంతా నా కనుసన్నల్లో పని చేయాలి
X

దిశ, వైరా : "వైరా మున్సిపాలిటీలో నేను చెప్పిందే వేదం... కార్మికులంతా నా కనుసన్నల్లోనే పని చేయాలి. నేను చెప్పినట్లే వినాలి. చెప్పింది వినని కార్మికుల సంగతి ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నా మాట వినకుంటే మీరు ఇక్కడ ఎలా పని చేస్తారో కూడా చూస్తా. నాకు ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి". అంటూ.. వైరా మున్సిపాలిటీలో పని చేసే కార్మికులపై ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పెత్తనం చెలాయిస్తున్నారు. మున్సిపాలిటీలోని ఓ ఉన్నతాధికారి తనకు కట్టబెట్టిన అనధికారిక శానిటైజేషన్ ఉద్యోగంతో కార్మికులను అవుట్సోర్సింగ్ ఉద్యోగి హడలెత్తిస్తున్నారు.

తాను చెప్పినట్లు వినకపోతే మీరు ఎలా పని చేస్తారో చూస్తానంటూ హుకుం జారీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీలోని ఉన్నతాధికారి ఓ ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి శానిటైజేషన్ లో ఉన్నత ఉద్యోగ బాధ్యతలు అప్పగించటంతో ఆ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఆడిందే ఆటగా... పాడిందే పాటగా మారింది. నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోఆర్డినేషన్ చేసే పనిని మున్సిపాలిటీలోని రెగ్యులర్ ఉద్యోగులకు అప్పగించాల్సి ఉంది.

వైరా మున్సిపాలిటీలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు వీఆర్వో స్థాయిలోని వార్డు ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వీరందని కాదని ఓ ఉన్నతాధికారి ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని అందలం ఎక్కించడం ప్రస్తుతం వైరాలో చర్చనీయాంశంగా మారింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తనకు అప్పగించిన అదనపు బాధ్యతల అధికారాన్ని ఉపయోగించి మున్సిపాలిటీ కార్మికులను చివరకు విధులు బహిష్కరించే స్థాయికి తీసుకువెళ్లారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కార్మికులపై ఒత్తిడి పెంచి విధులు బహిష్కరించిన వైనం..

వైరా మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఓ భవన కేంద్రంగా జరిగిన వివాదాన్ని చూపి మున్సిపాలిటీ కార్మికులపై ఒత్తిడి తెచ్చి వారు విధులు బహిష్కరించే స్థాయికి ఆ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితిని తీసుకువెళ్లారు. వైరా బస్టాండ్ వెనుక అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనానికి స్లాబ్ వేస్తున్నారని మున్సిపాలిటీ అధికారులకు మంగళవారం రాత్రి ఫిర్యాదులు అందాయి. దీంతో మున్సిపాలిటీ అధికారులు ఆ భవన నిర్మాణ పనులు ఆపేందుకు కొంతమంది మున్సిపాలిటీ సిబ్బందిని అక్కడికి పంపారు.

అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న సదరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కోవర్టుగా వ్యవహరించారు. భవన నిర్మాణాన్ని ఆపేందుకు మున్సిపాలిటీ సిబ్బంది వస్తున్నారని భవన యజమానికి అనుకూలంగా ఉన్న ఓ కౌన్సిలర్‌కు ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఫోన్ చేసి ముందస్తు సమాచారం అందించి కోవర్టుగా వ్యవహరించాడు. దీంతో భవన నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్లిన సిబ్బందికి, ఒక కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు మున్సిపాలిటీ సిబ్బంది అక్కడ నుంచి నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కోవర్టుగా వ్యవహరించడం వల్ల వివాదం నెలకొనటంతో ఈ విషయం తెలిసిన మరో కౌన్సిలర్ ఆ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బుధవారం తెల్లవారుజామున తనపై ఓ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారని అక్కసుతో మున్సిపాలిటీ కార్మికులను ఔట్సోర్సింగ్ ఉద్యోగి రెచ్చగొట్టి, బెదిరించి విధులు బహిష్కరించే విధంగా చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ తాను కోవర్టుగా వ్యవహరించడం వల్ల వివాదం జరిగిన విషయం బహిర్గతం కాదని దీమాతో ఆ ఉద్యోగం ఉన్నారు. కానీ అతని కోఆర్టు వ్యవహారం పూర్తిగా బహిర్గతం కావడం విశేషం.

ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మున్సిపాలిటీలోని ఓ ఉన్నతాధికారి ప్రాముఖ్యత ఇస్తుండటం వల్లే భయపడి అతని చెప్పినట్లు విధులు బహిష్కరించామని కొంతమంది కార్మికుల దిశకు తెలిపారు. అంతేకాకుండా తమపై పెత్తనం చేసే పోస్ట్ ఆ ఉద్యోగికి ఉండటం వల్ల ఆయన చెప్పినట్లు గత్యంతరం లేని పరిస్థితుల్లో విధులు బహిష్కరించామని కొంతమంది కార్మికులు పేర్కొంటున్నారు. కోవర్టులా వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగా వివాదాలను సృష్టిస్తున్న ఇలాంటి ఉద్యోగి వల్ల వైరా మున్సిపాలిటీ ప్రతిష్టలు మరింత రోడ్డును పడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story