పత్తాలేని బీఆర్ఎస్ లీడర్లు! నిస్తేజంలో పార్టీ నేతలు, కేడర్

by Disha Web Desk 1 |
పత్తాలేని బీఆర్ఎస్ లీడర్లు! నిస్తేజంలో పార్టీ నేతలు, కేడర్
X

ఓ వైపు మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత లిక్కర్ వ్యవహారంలో జైలు పాలుకావడం.. మరో వైపు ఫోన్ ట్యాపింగ్ విషయం చినికిచినికి గాలివానగా మారుతుండటంతో జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ తలనొప్పులు ఏంటని మిన్నకుంటున్నాయి. పార్టీని గాడిన పెట్టి బలోపేతం చేయాల్సిన నాయకులు ఒక్కరు కూడా కనిపించకుండా పోవడంతో విస్మయం వ్యక్తమవుతుంది. జిల్లాలో మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును అధిష్టానం ప్రకటించినా ఆ దిశగా సమాయత్తం కాకపోవడంతో నిస్తేజం ఆవహిస్తుంది.

దిశ బ్యూరో, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రోజురోజుకూ డీలా పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుదుపుతో మొదటి, ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కడికక్కడ మూటాముల్లె సర్దుకుంటున్నారు. అవకాశం ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. వివాదాలు అలముకున్న నాయకులు మాత్రం అటుఇటు కాకుండా మిన్నకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా స్థానికంగా కూడా అందుబాటులో లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీని గాడిలో పెట్టాల్సిన నాయకుల జాడ లేకపోవడంతో ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నారు.

ఎన్నికల వేళ సమస్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధానంగా లిక్కర్ కేసులో కవిత జైలు పాలుకావడం.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పోలీసు అధికారులతో పాటు నాటి ప్రజాప్రతినిధులకూ లింకులు ఉండటంతో జిల్లాలో నాయకులు సైతం డైలామాలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడినా ఇబ్బంది తప్పదనే భావనతో ఎక్కడి నాయకులు అక్కడే ఉంటున్నారు. పార్టీ పరిస్థితి దేవుడెరుగు.. ప్రస్తుతం ఆచితూచి అడుగేయడమే మంచిదనే భావనలో ఉన్నారు. దాంతో జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ముందునుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. పార్టీని, పార్టీ శ్రేణులను గాడిలో పెట్టే ఒక్క నాయకుడు కూడా జిల్లాలో అందుబాటులో లేకపోవడంతో ఎవరికివారే ఇతరపార్టీల్లో ఉన్న అవకాశాలను వెతుక్కునే పనిలో ఉన్నారు.

జిల్లా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్?..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారి తిరుగుబావుటా ఎగరేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ గురైనట్లు చర్చ జరుగుతుంది. అధిష్టానాన్ని, పార్టీ పెద్దలను ధిక్కరించి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లా నేతల ఫోన్లు తప్పకుండా ట్యాపింగ్ చేసి ఉంటారని, టార్గెటెడ్ గా తనిఖీలు కూడా జరిగాయని ఆ పార్టీ నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సహకరించి ఉంటారని, ఆ దిశగా ఎంక్వైరీ జరగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థిని ప్రకటించినా..

ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఆ పార్టీ నెల క్రితమే ప్రకటించినా జిల్లా నాయకులు ఎవ్వరూ క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడానికి కారణమేంటన్నది మాత్రం శ్రేణులకు అర్థం కావడం లేదు. నామ నాగేశ్వరరావు కుమారుని వివాహంలో బిజీగా ఉన్నా.. మిగతా నాయకులు పార్టీని, క్యాడర్ ను బలోపేతం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొలుపుతున్నది. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలున్నా ఒకరిద్దరు తప్ప మిగతావారంతా నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిన ఈ తరుణంలో పార్టీని పట్టించుకోకపోవడంతో అనేక విమర్శలు వస్తున్నాయి. పట్టించుకోవాల్సిన నాయకులే దూరంగా ఉన్నప్పుడు తమకెందుకు చిక్కులు అంటూ క్యాడర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది.


Next Story

Most Viewed