'వైరా' బీఆర్ఎస్‌లో ప్రకంపనలు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి వార్

by Dishafeatures2 |
వైరా బీఆర్ఎస్‌లో ప్రకంపనలు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి వార్
X

దిశ, వైరా: గత కొన్ని రోజుల క్రితం వరకు ఐక్యత రాగం వినిపించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో తాజాగా నెలకొన్న దళిత బంధు రచ్చ తీవ్ర స్థాయికి వెళ్ళింది. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ శుక్రవారం వైరాలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన క్యాడర్ ను వెళ్లనీయకుండా అడ్డుకునే స్థాయికి రాజకీయాలు వెళ్లాయి. దీంతో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు భానోత్ మదన్ లాల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన విషయం పాఠకులకు విధితమే. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ తనకు అధిష్టానం టికెట్ కేటాయించకపోయినప్పటికీ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు. పార్టీ అభివృద్ధికి, బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా మదన్ లాల్, రాము నాయక్ వర్గాల మధ్య తాజాగా దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చిచ్చు రగిల్చింది.

నియోజకవర్గంలో రెండో విడత 600 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాములు నాయక్ దళిత బంధు పథకం కోసం జాబితాను తయారు చేసి కలెక్టరేట్‌కు పంపారు. అదేవిధంగా మదన్ లాల్ 472 మంది లబ్ధిదారుల పేర్లతో దళిత బంధు కోసం కలెక్టరేట్ కు జాబితా పంపారు. అయితే తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా మదన్ లాల్ ప్రభుత్వ పథకాల అమలులో జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యే రాములు నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా శుక్రవారం వైరాలో ఎమ్మెల్యే నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు ఎమ్మెల్యే రాములు నాయక్ అనుచరులుగా కొనసాగుతున్నారు . రాములు నాయక్ దళిత బంధు యూనిట్ల కోసం పార్టీలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సమయంలో ప్రతిగా మదన్ లాల్ జాబితాను తయారు చేయడం, ఆ జాబితాకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపింది.

ఎమ్మెల్యే రాములు నాయక్ వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయన అనుచరులు ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలంలా మారారు. దీంతో మదన్ లాల్ వర్గీయులు పునరాలోచనలో పడినట్లు అయింది. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లి జూలూరుపాడు మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి రాములు నాయక్ అనుచరులుగా ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మదన్ లాల్ అనుచరులు మంతనాలు కొనసాగిస్తున్నారు. రాములు నాయక్ నిర్వహించే సమావేశానికి నాయకులు వెళ్లకుండా ఉంటే మదన్ లాల్ వారందరికీ దళిత బంధు యూనిట్లు కేటాయిస్తారని మధ్యవర్తిత్వం కొనసాగించే నాయకులు చర్చలు జరుపుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులతో మదన్ లాల్ తో ఆయన అనుచరులు ఫోన్లో నేరుగా మాట్లాడిస్తున్నట్లు తెలిసింది. అయితే రాములు నాయక్ వెంట ఉన్న వారిలో కొంతమంది పునరాలోచనలో పడ్డారు.

అయితే ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యే సమావేశానికి హాజరు అవుతామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే సమావేశం ముగిసిన తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదామని అత్యధికమంది మధ్యవర్తిత్వం చేసేందుకు వచ్చిన మదన్ లాల్ అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు రాములు నాయక్ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను కాదని మరొకరు ప్రభుత్వ పథకాల జాబితాలు ఎలా తయారు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కారేపల్లి మండలంలో తమకు తెలియకుండా 75 మంది లబ్ధిదారుల జాబితాను ఏకపక్షంగా తయారు చేయటం పట్ల మదన్ లాల్ వర్గంలోని ఇద్దరు ముఖ్య అనుచరులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. వారిరువురిని కూడా మదన్ లాల్ వర్గీయులు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా దళిత బంధు లబ్దిదారుల ఎంపికపై బీఆర్ఎస్ లో గతంలో ఉన్న వర్గపోరు మరోసారి బహిర్గతమై రచ్చ రచ్చగా మారుతుంది.



Next Story

Most Viewed