అక్రమ నిర్మాణంపై దిశ వరుస కథనాలు.. దిశ రిపోర్టర్ కు బెదిరింపులు

by Dishafeatures2 |
అక్రమ నిర్మాణంపై దిశ వరుస కథనాలు.. దిశ రిపోర్టర్ కు బెదిరింపులు
X

దిశ, ఖమ్మం రూరల్​: అక్రమ నిర్మాణంపై వార్తలు రాసినందుకు ఓ ప్రవేట్ హాస్పిటల్ యజమాని దిశ రిపోర్టర్ పై బెదిరింపులకు పాల్పడ్డారు. నిజాన్ని నిష్పక్షపాతంగా రాసినందుకు ' నీకు భార్యా పిల్లలున్నారు కదా.. జాగ్రత్త'' అంటూ హెచ్చరించారు. అక్రమ నిర్మాణం.. ఆపై బెదిరింపుల పర్వం.. మాటల గారడితో మభ్యపెట్టే తత్వం.. ఇవీ ఆ హాస్పటల్ నిర్వాహకురాలి అసలు నైజం. రెండు రోజులుగా 'దిశ'లో అక్రమ భవంతిపై కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు నిర్మాణ పనులను నిలుపుదల చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని ఆదేశాలిచ్చినా సదరు హాస్పిటల్ ఓనర్ పట్టించుకోలేదు సరికదా బెదిరింపులకు పాల్పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?

ఖమ్మం రూరల్​ మండలం ఏదులాపురం బైపాస్​ ప్రధాన రహదారి పక్కన ఖమ్మం నగరానికి చెందిన బిలీఫ్ ఆస్పత్రి యజమాన్యం బహుళ అంతస్తు భవనం నిర్మాణం జరుపుతోంది. రోడ్డుకు ఇరువైపులా ప్రధాన రహదారులండగా.. కార్నర్ లో ఈ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణానికి సంబంధించిన నిబంధనలు పూర్తిగా గాలికోదిలేసి, ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరుపుతున్న విషయాన్ని, రేకులు అడ్డుపెట్టి నిర్మాణం జరుగుతున్న క్రమంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను 'దిశ' దినపత్రికలో రెండు రోజులుగా వరుస కథనాలను ప్రచురించింది. స్వయంగా అధికారులే ఈ కట్టడం అనుమతులకు పూర్తి భిన్నంగా ఉన్నాయని, వెంటనే నిర్మాణాలు ఆపాలని నోటీసులు సైతం జారీ చేశారు. అయినా అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన యజమాని యథేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తుండడం, దిశ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతం ఆ నిర్మాణాన్ని ఆపేశారు.


నోటీసులో ఏముందంటే?

100 ఫీట్ల హైవే రోడ్డుకు ఉండాల్సినదానికంటే తక్కువ సెట్ బ్యాక్ తో నిర్మాణం చేపట్టారని రెండు దిక్కుల్లో అసలు సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనల మేరకు సెల్లార్, గ్రౌండ్ తో పాటు మరో నాలుగు ఫ్లోర్ల నిర్మాణం సెట్ బ్యాక్ లేకుండా చేశారని, అనుమతి ప్రకారం కాకుండా డీవియేషన్ తో నిర్మాణం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అనుమతి తీసుకున్న ప్రకారం కాకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో నిర్మాణం చేస్తున్నారని, ఇప్పటివరకు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అందులో పేర్కొన్నారు. లేని ఎడల పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దిశ విలేకరికి బెదిరింపులు

శనివారం ఉదయం ఖమ్మం రూరల్​ 'దిశ' రిపోర్టర్​కు సదరు యజమానురాలైన మువ్వా రమాజ్యోతి ఫోన్​ చేసి ''మీరు ఎన్నిరోజులు వరుస కథనాలు రాస్తారు.? నీకు బిడ్డలు ఉన్నారా..? అంటూ బెదిరించచడంతో పాటు జర్నలిజం అంటేనే బ్లాక్​మెయిల్​'' అని జర్నలిజం పై తన అక్కసును వెళ్లగక్కింది. నిజాలు రాసే 'దిశ'కు బెదిరింపులు ఏం కొత్త కొత్తకావని, తాము తప్పుడు కథనాలు రాస్తే లీగల్​గా వెళ్లవచ్చని రిపోర్టర్​ సమాధానం చెప్పాడు.

వివాదాలకు కేరాఫ్ గా

ఖమ్మంలో బిలీఫ్​ హాస్పిటల్​లో కొద్దిరోజుల క్రితం ఐటీ దాడులు జరిగితే బిల్డింగ్​ మూడవ అంతస్తు నుంచి కీలక డాక్యుమెంట్లను కిందపడేసి వాటిని బైక్​ పై తరలించిన విషయాన్ని కూడా 'దిశ' వెలుగులోకి తెచ్చింది. ప్రధాన పత్రాలను తప్పించినట్లు అప్పట్లో ఆరోపణలు సైతం ఉన్నాయి. తాజాగా రూరల్​లో నిర్మిస్తున్న భవనానికి అనుమతులకు వ్యతిరేకంగా భవనం నిర్మించడం అధికారులను మేనేజ్​ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన విషయంతో పాటు కమిషనర్​, కలెక్టర్​ నిర్మాణాన్ని అపేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్నే దిశ ప్రచురించింది. నిజాలను వెలుగులోకి తీసుకవస్తున్న దిశ విలేకరిపై బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు కరెక్టో అధికారులు నిగ్గు తెల్చాలి. నిజాన్ని నిక్కచ్చిగా రాస్తున్న రిపోర్టర్లపై ఇలా వ్యవహరించడం సరికాదని స్థానికులు సదరు హాస్పిటల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.



Next Story

Most Viewed