వాడవాడకూ పువ్వాడ....

by Dishanational1 |
వాడవాడకూ పువ్వాడ....
X

దిశ ఖమ్మం, బ్యూరో: ఎన్నికల సీజన్ మొదలు కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీల నేతలు ఇప్పటికే జనం బాట పట్టారు. ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పేరుతో ప్రజల మధ్యలోనే ఉంటూ వచ్చే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. వీరితోపాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే ముఖ్యనేతలు సైతం వీలు చేసుకుని మరీ జనం మధ్యే ఉంటున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతామధు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ జనం మధ్యే ఉంటూ రాబోయే ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ నేతలతోపాటు పలు పార్టీల నాయకులు తమ ఉనికి చాటుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు..

వాడవాడకూ పువ్వాడ...

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినూత్న రీతిలో తిరుగుతూ జనంబాట పట్టారు. వాడవాడకూ పువ్వాడ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వీలు దొరికినప్పుడల్లా గల్లీగల్లీలో తిరుగుతూ అక్కడి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. ఆయా వార్డుల్లో మిగిలి ఉన్న అభివృద్ధి పనులు సైతం పూర్తి చేసేలా స్థానిక నేతలను, అధికారులను పురమాయిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సైతం ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లను ఆకట్టుకుంటూ జనం మధ్యే ఉంటున్నారు.

భరోసా కల్పిస్తూ ముందుకు పోతున్న నామా...

ఎంపీ నామా నాగేశ్వరరావు సైతం పలు రకాల కార్యక్రమాలతో ప్రజల బాట పడుతున్నారు. ఖమ్మంలో ఉన్నప్పుడల్లా ఏదోఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని జనాల్లోనే ఉంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో తిరుగుతూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాధితులను పరామర్శ చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తూ పార్టీలకతీతంగా ఆదుకుంటున్నారు. పలు రకాల అభివృద్ధిపనులకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు.

నియోజకవర్గాల వారీగా సమావేశాలు...

జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సైతం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి పది స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఆత్మీయ సమ్మేళనాలతో పొంగులేటి..

ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తన టీంను రెడీ చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముందుకు కదులుతున్నారు. వీలైనప్పుడల్లా ప్రజల్లోనే ఉంటూ తనదైన శైలిలో పరామర్శలు, శుభకార్యాలకు వెళ్తూ జనాల్లోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తన టీంను రెడీ చేసుకున్న పొంగులేటి జనం మద్దతు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ మారేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు.

అన్ని నియోజకవర్గా్లోనూ అంతే..

అన్ని నియోజకవర్గాల్లోనూ అప్పుడే రాజకీయ సందడి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి టికెట్ ఆశించేవారు సైతం ఇప్పుటి నుంచే జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కృషిచేస్తూ జనం మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పాలేరులో కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, వైరాలో లావుడ్యా రాములు నాయక్, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, పినపాకలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇల్లెందులో బానోత్ హరిప్రియా నాయక్ తమతమ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు.


Next Story