పొంగులేటి పార్టీ మార్పు సస్పెన్స్‌కు ఆ రోజే తెర..? ఉత్కంఠ రేపుతోన్న మాజీ MP డెసిషన్

by Satheesh |
పొంగులేటి పార్టీ మార్పు సస్పెన్స్‌కు ఆ రోజే తెర..? ఉత్కంఠ రేపుతోన్న మాజీ MP డెసిషన్
X

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ ఉత్కంఠ వీడటం లేదు. ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయమై సస్పెన్స్ నెలకొన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేయగల నేతగా పలు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఆయనను చేర్పించుకునేందుకు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల14న ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఖరారు కావడం.. పలు పార్టీల దృష్టి అటువైపు మళ్లినట్లు తెలుస్తున్నది. ఈసమ్మేళనంలో పొంగులేటి తన నిర్ణయం ప్రకటిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.

దిశ, ఖమ్మం బ్యూరో: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ రోజురోజుకూ ఉత్కంఠను రేపుతూనే ఉంది. ఆయన ఇంతకీ ఏ పార్టీలో చేరుతారు..? ఎప్పుడు ప్రకటన చేస్తారో అని ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీనా..? కాంగ్రెసా..? లేక సొంత పార్టీ పెడతారా..? అనేది ఎటూ తేలడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేయనున్నట్లు పలు పార్టీలు అంచనా వేస్తున్న నేపథ్యంలో పొంగులేటిని తమ పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్, బీజేపీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

రెండు పార్టీల రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో పొంగులేటితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయినా ఎటూ తేలకపోవడం గమనార్హం. ఈనేపథ్యంలో ఈనెల 14న ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఖరారు కావడం.. పలు పార్టీల దృష్టి అటువైపు మళ్లినట్లు తెలుస్తున్నది. అప్పుడైనా పార్టీ మార్పుపై ఏదైనా ప్రకటన చేస్తారా..? లేక కొంత కాలం వేచిచూస్తారా.? అని పొంగులేటి అభిమానులతో పాటు ముఖ్యనేతలు సైతం ఎదరుచూస్తున్నారు.

సొంత స్థలంలో నిర్వహణ..

ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల తమ వర్గం తరఫున పోటీ చేసే అభ్యర్థులను సైతం ఖరారు చేశారు. కానీ పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటన ఎక్కడా చేయలేదు. ఈ క్రమంలోనే 14 తేదీన ఖమ్మం ఆత్మీయ సభ ఖరారైంది. అయితే ఇటీవల తాను తలపెట్టిన పటు కార్యక్రమాలకు అధికార పార్టీ నేతలు ఇబ్బందులు గురిచేయడం.

ఇఫ్తార్ విందు సందర్భంగా వేదికలు ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేయడంతో ఇబ్బంది ఎదురైన విషయం తెలిసిందే. దానిని దృష్టిలో ఉంచుకుని 14న జరిగే ఖమ్మం ఆత్మీయ సమ్మేళనానికి తన సొంత స్థలంలోనే వేదికను ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. ఎస్ఆర్ గార్డెన్ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్‌లో సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు. అంతేకాదు ఈసభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్లు కూడా తెలుస్తున్నది.

పార్టీ మార్పుపై స్పష్టత..?

పార్టీ మార్పు విషయమై ఇంతకాలం నాన్చుతూ వస్తున్న పొంగులేటి 14న స్పష్టత ఇవ్వొచ్చని ఆయన ముఖ్య అనుచరులు కొందరు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏపార్టీలో చేరుతున్నారనే విషయమై ఊహాగానాలు తప్ప.. ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. ఈ విషయమై సోషల్ మీడియాలో సైతం రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రకటన చేయాల్సి ఉండడంతో 14నే ప్రకటన ఉండబోతోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

చర్చనీయాంశంగా..

బహిష్కరణతో తర్వాత తీవ్రస్థాయిలో బీఆర్ఎస్‌పై ఫైర్ అయిన పొంగులేటి వ్యవహారం రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతున్నది. ఉమ్మడి జిల్లాలో అత్యంత ప్రజాధరణ నేతగా గుర్తింపు పొందడం, వేరే పార్టీలు అంత బలంగా లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల దృష్టి ఇప్పుడు పొంగులేటివైపు మళ్లాయి.

ఆయన ఏపార్టీలో చేరితే ఆపార్టీ ఉమ్మడి జిల్లాలో హవా కొనసాగించడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ఆయన పార్టీ మార్పుపై కొంత కాలంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా సామాన్య జనాలు, కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారి ఓరకంగా పొంగులేటికి పాజిటివ్ ప్రచారం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు పొంగులేటి వ్యవహారం రాజకీయాల మీద అవగాహన ఉన్న సామాన్యుడికి సైతం తెలుసని.. ఇది ఆయనకు కలిసొచ్చే అంశంగా పరిగణిస్తున్నారు.

Advertisement

Next Story