మాట ఇస్తున్నా.. తప్పేది లేదు: పాలేరు నియోజకవర్గ ప్రజలకు పొంగులేటి కీలక హామీ

by Disha Web Desk 19 |
మాట ఇస్తున్నా.. తప్పేది లేదు: పాలేరు నియోజకవర్గ ప్రజలకు పొంగులేటి కీలక హామీ
X

దిశ, నేలకొండపల్లి : ‘‘గత పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు. నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా.. అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా.. పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం నేలకొండపల్లి మండలంలోని ఆచర్ల గూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, కోరట్ల గూడెం, అమ్మగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, ముఠాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల హామీ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇది పాలేరు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు తన స్పష్టమైన హామీ అని అన్నారు.

పాలేరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని ప్రధానమైన ఆరు గ్యారెంటీలను పరిష్కారిస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు. ఆర్సీసీ వాల్ నిర్మాణం, మున్నేరు వరదలకు శాశ్వత పరిష్కారం, రూరల్ మండలంలో లేఔట్ల క్రమబద్ధీకరణ, పాలేరులో కొత్త బస్ టెర్మినల్, బచ్చోడు, బీరోలు, బంగ్లా రూట్ వంటి బస్ సర్వీసులు పునరుద్ధరణ చేయిస్తానని తెలిపారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అర్హులైన యువతకు ప్రతి ఏటా జాబ్ మేళ, మత్స్య పరిశోధన కేంద్రంకు కావాల్సిన శిక్షణ గదులు, ఆడిటోరియం నిర్మాణం, ప్రతి మండలంలో యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, పాలేరు ప్రజలకు అందుబాటులోకి డిగ్రీ కాలేజీని తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రులను 50 పడకల ఆసుపత్రులుగా మార్పు.. సీతారామ ప్రాజెక్టు, కెనాల్ పనులు పూర్తి చేసి తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలల్లో ఆయకట్టు విస్తరణ, పూర్తిస్థాయిలో మద్దులపల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ధి, పాలేరు చేపల ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపన చేస్తానని మాట ఇచ్చారు. ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తి.. బీసీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.. అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు కృషిచేస్తానన్నారు. డంపింగ్ యార్డ్ దానవాయిగూడెం నుంచి తరలింపు, పాలేరు చెరువు, బుద్ధ స్తూపం, తీర్ధల క్షేత్రం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కోరారు.

Next Story

Most Viewed