హామీ ఇచ్చారు... నెరవేర్చారు

by Sumithra |
హామీ ఇచ్చారు... నెరవేర్చారు
X

దిశ, వైరా : హామీలను ఇవ్వటమే కాదు.. ఆ హామీలను నెరవేరుస్తూ ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతున్నారు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తన పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సీసీ రోడ్ల నిర్మాణ హామీలను నిలబెట్టుకున్నారు. వైరా మండలంలోని విప్పల మడక గ్రామ ప్రజలకు ఇచ్చిన ఓ హామీని ఎమ్మెల్యే అమలు చేసి ఆ గ్రామ ప్రజల ఆదరణ అభిమానం పొందారు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన శివరాత్రి పర్వదినం సందర్భంగా విప్పలమడక గ్రామంలోని శ్రీ సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వైరా - నెమలి ప్రధాన రహదారి నుంచి సోమలింగేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ రోడ్డు అద్వానంగా ఉండటంతో దేవాలయానికి వచ్చేందుకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఎమ్మెల్యేకు వివరించారు.

దీంతో స్పందించిన ఎమ్మెల్యే 3 నెలల లోపు ఈ దేవాలయానికి సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మూడు నెలల్లోనే దేవాలయానికి సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎస్డీఎఫ్ నిధులు 7 లక్షల రూపాయలను ఎమ్మెల్యే మంజూరు చేశారు. ఈ నిధులతో త్వరలో సోమలింగేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించనున్నారు. ఇలా నియోజకవర్గంలో తన పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో ఇచ్చిన సీసీ రోడ్ల నిర్మాణ హామీలను అమలు చేసేందుకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారు. విప్పలమడక గ్రామంలో దేవాలయం సీసీ రోడ్డుకు రూ. 7లక్షలతో పాటు మరో నాలుగు సీసీ రోడ్లు నిర్మించేందుకు రూ.12 లక్షలు నిధులను ఎమ్మెల్యే మంజూరు చేశారు. తన హామీ మేరకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు విప్పలమడక గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story