ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి

by Disha Web Desk 15 |
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి
X

దిశ,ఇల్లందు : మహబూబ్ బాద్ లో రేపు జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ మహిళా శక్తి సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 15 ఎంపీ సీట్లు, అందులో మహబూబ్ బాద్ ను భారీ మెజారిటీతో బలరాం నాయక్ ను గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రేపు బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా లక్ష మందితో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కదిలి రావాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్క తాను ముక్కలేనని విమర్శించారు.

పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ తెగనమ్మారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్, విమానాశ్రయాలు, రైల్వే తదితర సంస్థలను ప్రైవేటుపరం చేశారని, తిరిగి మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని బొగ్గు పరిశ్రమను సైతం విక్రయిస్తారని అన్నారు. దేశంలో ప్రజలు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల పట్ల నమ్మకంతో ఉన్నారని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు కలలు కంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో పడిపోతుందని నీచంగా మాట్లాడటం ఆ పార్టీ నాయకులకే చెల్లుతుందని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత ఎవరైనా అధికారంలోకి రావాలని కోరుకుంటారని కానీ బీఆర్ఎస్ మూడు నెలల్లోనే తిరిగి అధికారంలోకి రావడానికి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు కానీ కొంతమంది నాయకులు మాట్లాడే తీరు పట్ల ప్రజలు అసహ్యించు కుంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు దొరకని దిక్కులేని స్థితిలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయి నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బలపరిచేందుకు ప్రజల సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. తుక్కుగూడ రాహుల్ గాంధీ బహిరంగ సభకు ఇల్లందు నియోజకవర్గ నుండి అనుకున్న సంఖ్యలో హాజరు కాలేదన్న రిపోర్టు తమ దగ్గర ఉందని, అలాంటి తప్పు రేపు జరగబోయే ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో జరగవద్దని

ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటికి చురకలు అంటించారు. కాంగ్రెస్ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, మహిళా నాయకురాలు దేవి ప్రసన్న, మండల అధ్యక్షుడు పులి సైదులు, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ అనసూయ, సుదర్శన్ కోరి, కొక్కు నాగేశ్వరరావు, మహిళా సంఘం నాయకురాళ్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed