ప్రభుత్వాస్పత్రిలో కేటుగాళ్లు.. ఇన్‌ పేషెంట్ భోజనంలో నాణ్యత నిల్

by Disha Web Desk 1 |
ప్రభుత్వాస్పత్రిలో కేటుగాళ్లు.. ఇన్‌ పేషెంట్ భోజనంలో నాణ్యత నిల్
X

ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఫుడ్ కాంట్రాక్టర్ తగిన సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయకుండా ప్రతి నెల బిల్లు డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ సారు చెప్పిందే వేదం. బిల్లు ఆలస్యం అయితే వెంటనే మాజీ మంత్రి ద్వారా ఫోన్ చేపించి బిల్లు తీసుకునే వారని తెలుస్తోంది. ఏళ్లుగా ఆయనే భోజన కాంట్రాక్టరుగా ఉంటున్నారు. రోగులకు అందించే భోజనం విషయంలో నాణ్యత ఆయన పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో కొంతమంది రోగులకు అందించి మిగతా రోగులకు భోజనం అందించకుండా బిల్లు పొందుతున్నాడు. కాగా, మెడికల్ కాలేజీ స్టూడెంట్‌లకు ఇక్కడి నుంచే భోజనం తరలిస్తున్నట్లుగా టాక్. ఈ సమస్యను పట్టించుకుని పరిష్కరించాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు.

దిశ, ఖమ్మం : రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్లుగా ఖమ్మం సర్కారీ దవాఖానా పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేయకుండా చక్కగా ప్రతి నెల బిల్లు డ్రా చేసుకుని అధికారులను బెదిరింపులకు దిగుతున్నారు. ఎపుడొచ్చామని కాదు.. అన్నయ్యా బులెట్ దిగిందా లేదా అంటూ ప్రధాన ఆసుపత్రికి భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్ తీరు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ సారు చెప్పిందే వేదం. ఒకవేళ బిల్లు ఆలస్యం అయితే వెంటనే మాజీ మంత్రి ద్వారా ఫోన్ చేపించి బిల్లు తీసుకునే వారు.

కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే కాంట్రాక్ట్ సారు ఇపుడు గెలిచిన ఎమ్మెల్యే తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తే అంటూ ఆసుపత్రి పరిపాలనా అధికారులపై చిందులు వేయడంతో అధికారులు అవాక్కవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చాక కూడా నూతన టెండర్ల పాలసీ విధానం కానీ.. గత పాలకుల కనుసల్లో నడిచిన వ్యక్తుల జులుం అరికట్టడం లేదని ఆసుపత్రికి వచ్చే రోగులు చెబుతున్నారు. ప్రతి రోజూ రోగులకు ఎంత మేర భోజనం అందిస్తున్నారు, నాణ్యత ఎంత వరకు ఉంది అనే అంశాలపై అధికారులు దృష్టి సారించడం లేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

మెడికల్ కౌన్సిల్ ప్రకారం రోగులకు బోజన సదుపాయాలు కల్పిస్తున్నామా అంటే లేదనే వినిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది రోగులకు అందించి మిగతా రోగులకు భోజనం అందించకుండా బిల్లు ఆమోదం చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన ఆసుపత్రిలో భోజన కాంట్రాక్ట్ అనేక సంవత్సరాల నుంచి అయనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జరుగుతున్న వంటకాలు రోగులకు అందుతున్న ఆహార సదుపాయాల వ్యవహార శైలిలో కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న డైట్ విభాగం ద్వారానే నూతన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కు ఇక్కడి భోజనం వెళ్లడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భోజనంలో నాణ్యత ఏది?

నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు జరిగిన ప్రక్రియలో భాగంగా ఆసుపత్రి డైట్‌లోంచే మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నట్లు సమాచారం. అసలు ప్రభుత్వాస్పత్రి రోగులు ఎంతమంది.? ఎవరెవరికి ఎంత ఆహారం సరిపడా వస్తుంది..? ఎంత ఆహారాన్ని తయారు చేయాలి..? వండిన ఆహారంలో నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే కోణంలో అధికారులు దృష్టి సాధించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. చికెన్‌తో భోజనం అంశంలో కూడా ఎంతమందికి ఎంత చికెన్ వండారు? ఎంత చికెన్ ఎంతమందికి పెట్టారు..? అనే అంశాలు కూడా పరిశీలిస్తే.. అన్నింట నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలేనని పలువురు ఆరోపిస్తున్నారు. రోగులకు సరిపడా పంపిణీ చేసే అంశంలో కూడా డైట్ అధికారిని వారి చేతివాటం బాగానే ఉందని ఓ భోగట్టా. ఇటీవల జిల్లా మెడికల్ కాలేజీ ఏర్పాటులో వ్యవస్థలో అనేక మార్పులు జరిగినా భోజన సదుపాయాలు అందించే కాంట్రాక్ట్ వ్యవస్థ మార్పు రాలేదని ఆసుపత్రికి వచ్చే రోగులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

నూతన మెడికల్ కాలేజీ నిర్వాహణలో భాగంగా విద్యార్థులకు మెస్ అంశంలో కూడా టెండర్ ప్రక్రియ షురూ అయ్యేంత వరకు నూతన వ్యక్తులకు భోజన సదుపాయాల అంశంపై మెస్ ఏర్పాటు అప్పగింత కార్యక్రమం జరగాల్సి ఉండగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వ, మెడికల్ కాలేజీ భోజనం సదుపాయాలు అందించే విషయంలో జిల్లా కలెక్టర్ కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఇష్టం వచ్చిన బిల్లులు పెట్టుకుని తమకు నష్టం వాటిల్లుతుందని చెబుతూనే.. చారాన ఖర్చుకు భారాన ఖర్చును తగిలిస్తూ.. ప్రజాధనాన్ని దోచుకుంటున్న కాంట్రాక్టర్ల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.


Next Story

Most Viewed