మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి.. ఏసీపీ రెహమాన్

by Disha Web Desk 20 |
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి.. ఏసీపీ రెహమాన్
X

దిశ, వైరా : మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వైరా ఏసీపీ రెహమాన్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పోలీస్ అధికారులు, సిబ్బంది వైరాలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మధిర క్రాస్ రోడ్ వద్ద ఏసీపీ రెహమాన్ ప్రారంభించిన ఈ ర్యాలీ పలు ప్రధాన వీధుల్లో కొనసాగింది. అనంతరం మధిర క్రాస్ రోడ్ లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైరా ఏసీపీ రెహమాన్ మాట్లాడుతూ యువత చెడు స్నేహాల వల్ల అక్రమార్గాల్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తూ మానసికంగా వాటికి బానిసలుగా మారి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

మాదకద్రవ్యాలు వాడిన అనేకమంది పలు నేరాలకు పాల్పడి జైలు పాలు అయ్యారని స్పష్టం చేశారు. గంజాయి ఉత్పత్తి, రవాణా, వినియోగం చేసేవారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల రవాణా వినియోగానికి సంబంధించిన వివరాలను ప్రజలు పోలీస్ శాఖకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాలను కూకటి వేళ్ళతో నిర్మూలించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.

మాదకద్రవ్యాలకు బానిసైన వ్యసన పరులు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థ యాజమాన్యాలు విద్యార్థుల ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు యుక్త వయసులో పెడదోవ పట్టకుండా ఓ లక్ష్యంతో ముందుకు సాగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా సీఐ సురేష్ వైరా ఎస్సై మేడా ప్రసాద్ ఎక్సైజ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed