దిశ ఎఫెక్ట్…నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పై విచారణ షురూ

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్…నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పై విచారణ షురూ
X

దిశ, వైరా : నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తయారు చేసి వాటి ఆధారంగా ఇంటి నెంబర్లను కేటాయించిన వ్యవహారంపై వైరా రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. మండల మెజిస్ట్రేట్ తో పాటు గ్రామ రెవెన్యూ అధికారి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను సృష్టించిన వ్యవహారాన్ని దిశ దినపత్రిక వార్త కథనాల్లో బహిర్గతం చేసింది. దీంతో నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను తయారుచేసిన వారి వెన్నులో వణుకు మొదలైంది.

వైరా మున్సిపాలిటీ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలతో ఇంటి నెంబర్లు మంజూరు చేశారు. అయితే ఆ 40 దరఖాస్తులో ఉన్న ఇందిరమ్మ పట్టాలు నకిలీవా....? నిజమైనవేనా....? అనే విషయం తెలియకుండానే అధికారులు ఇంటి నెంబర్లు ఎలా మంజూరు చేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల జిరాక్స్ పత్రాలు ఆధారంగా మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్లు మంజూరు చేశారు. ఇంటి నెంబర్లు మంజూరు చేసే సమయంలో ఒరిజినల్ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఉన్నాయా....? లేవా.....? అనే విచారణ కూడా మున్సిపాలిటీ అధికారులు చేయలేదు.

అధికారులకు మామూళ్ళు అందటంతో ఒరిజినల్ పట్టాలు పరిశీలించకుండా ఇంటి నెంబర్లు మంజూరు చేశారని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలతో ఇంటి నెంబర్ మంజూరు చేసిన ఫైళ్ళ జిరాక్సులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఇందిరమ్మ పట్టాల్లో మూడు రకాల పెన్నులతో లబ్ధిదారులకు సంబంధించిన కాలాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందిరమ్మ పట్టాలు మంజూరు చేసిన తేదీల పరంగా తహసీల్దార్ కార్యాలయంలోని ఇందిరమ్మ ఇళ్ల జాబితా రికార్డులను పరిశీలించనున్నారు.

అనంతరం ఇంటి నెంబర్లు పొందిన యజమానులతో మాట్లాడి వారి వద్ద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒరిజినల్ పట్టా ఉందా.....? లేదా.....? అనే విషయంపై పరిశీలన చేయనున్నారు. ఇంటి యజమానుల వద్ద ఒరిజినల్ పట్టా లేకుంటే వారిని విచారించి ఈ జిరాక్స్ పట్టాలు ఎవరు తయారు చేశారనే సమాచారాన్ని తెలుసుకోనున్నారు. అయితే విచారణ మొదలు కావడంతో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు సృష్టించిన వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పట్టాలు సృష్టించిన కొందరు పలువురికి ఫోన్ చేసి విచారణ వల్ల భవిష్యత్తులో తమకు ఇబ్బంది ఉంటుందా అని ఆరా తీస్తున్నారు.

ముందుగా ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఈ పట్టాలు పంపుతారని, అక్కడికి వెళ్లి పట్టాలు వచ్చే వరకు తీవ్ర ఆలస్యం అవుతుందని నకిలీ పట్టాలు సృష్టించిన వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే అధికారులు నేరుగా ఇంటి యజమానులనే విచారించేందుకు సమాయత్తం కావడంతో నకిలీదారుల గుండెల్లో వణుకు మొదలైంది. ఈ పట్టాలు తయారుచేసిన ఓ ఎల్ టి పి కి వైరా లోని కొన్ని వార్డు సభ్యుల సంబంధీకులు అండగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా దిశ కథనాలతో నకిలీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాల ఇంటి నెంబర్ల కేటాయింపు తీగ లాగితే ఫోర్జరీ దారుల డొంక కదులుతోంది.


Next Story

Most Viewed