ఉపాధ్యాయులు కావాలంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రాస్తారోకో..

by Sumithra |
ఉపాధ్యాయులు కావాలంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రాస్తారోకో..
X

దిశ, అశ్వారావుపేట : వి వాంట్ హిందీ టీచర్.. వి వాంట్ సైన్స్ టీచర్ అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం గుమ్మడవల్లి జడ్పీ హై స్కూల్ లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలంటూ బుధవారం ఉదయం స్థానిక బస్ స్టాప్ వద్ద ప్రధాన రహదారి పై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. డీఈవో, ఎంఈఓ తక్షణమే ఉపాధ్యాయుల కేటాయింపు పై స్పష్టమైన హామీని ఇచ్చేవరకు ఆందోళనని విరమించేది లేదంటూ భీష్ముంచుకుని కూర్చున్నారు.

దీంతో అశ్వారావుపేట - వేలేరుపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులు.. అందులో 36 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా.. 8 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన పాఠశాలలో ఇద్దరే విధులు నిర్వహిస్తుండడం విద్యార్థుల విద్యా భవిష్యత్తు ప్రశ్నార్ధక మయ్యింది.. పాఠశాల పునః ప్రారంభించి నెల రోజులు పైబడినప్పటికీ టీచర్లను కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసే వరకు పాఠశాలను తెరవద్దంటూ.. పాఠశాలకు గ్రామస్తులు తాళం వేశారు.

Next Story