హస్తంలో అసమ్మతి.. సీపీఐకి తగులుతున్న సెగ

by Disha Web Desk 20 |
హస్తంలో అసమ్మతి.. సీపీఐకి తగులుతున్న సెగ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : పొత్తులో బీఆర్ఎస్‌ను చిత్తు చేద్దామని ఎదురు చూసిన సీపీఐ పార్టీ నాయకులకు కొత్తగూడెంలో చుక్కెదురవుతోంది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ కంచుకోటగా విరాజిల్లిన కొత్తగూడెం నియోజకవర్గాన్ని చేజిక్కించుకుంటే గూడెం ఎర్రజెండా వశం అవుతుందని భావించారు సీపీఐ నేతలు. కానీ కమ్యూనిస్టులకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని నిత్యం ప్రజల్లో ఉంచిన యెడవెల్లి క్రిష్ణను వదిలి పొత్తులో సీపీఐకి టికెట్ ఎలా ఇస్తారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. రాజీనామాలు అయినా చేస్తాం కానీ సీపీఐకి ససేమిరా మద్దతు తెలుపమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలు సీపీఐకి మింగుడుపడటం లేదు.

హస్తం అసమ్మతి..

గత నాలుగు, ఐదు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న నేతలకు ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు. సంవత్సరాల తరబడి హస్తం జెండాను మోస్తున్న నాయకులు కచ్చితంగా గూడెం సీటు తమకే వస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో పోత్తులో సీటు సీపీఐకి వెళ్లేసరికి కాంగ్రెస్ పార్టీలో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండడం లేదని భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు సొంత డబ్బు ఖర్చుపెట్టి పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటూ వచ్చిన తమకు ఖళీ చేతులు చూపించారని మండిపడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గడపగడపకూ కాంగ్రెస్ అంటూ ప్రతి గుమ్మం తొక్కిన నాయకులను వదిలేసి పొత్తులతో కేడర్‌ను చిత్తు చేస్తున్నారని కోపోద్రక్తులవుతున్నారు.

హస్తం గుర్తుని మోస్తే అనాథను చేసింది..

కొత్తగూడెం నియోజకవర్గ సీటు తనకే వస్తుందని ఐదు సంవత్సరాల పాటు కష్టపడ్డ యెడవెల్లి కృష్ణ నిరంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినా కష్టపడ్డ నేతకు విలువ లేకుండా పొత్తులో భాగంగా పక్క పార్టీకి చేయి అందించడం సిగ్గుచేటని యెడవెల్లి కృష్ణ వర్గీయులు మండిపడుతున్నారు. నేడు, రేపో తనకు టికెట్ కన్ఫార్మ్ అవుతుందని ఎదురు చూసిన యెడవెల్లి కృష్ణ టికెట్ రాకపోయేసరికి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తనకు సరైన గుణపాఠం నేర్పారని అంటున్నారు.

2018 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ తనను వదిలి వేరే అభ్యర్థికి టికెట్ కన్ఫామ్ చేయడమే కాక 2023 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని నిత్యం ప్రజల్లో ఉంచిన తనను వదిలి పొత్తులో సీపీఐకి టికెట్ ఎలా ఇస్తారని యెడవెల్లి కృష్ణ, తన అనుచరులు మండిపడుతున్నారు. రాజీనామాలు అయినా చేస్తాము కానీ సీపీఐకి ససేమిరా మద్దతు తెలుపమని తెగేసి చెబుతున్నారు. యెడవెల్లి కృష్ణ అభిమానుల అభీష్టం మేరకు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీలో నిలుస్తామని తెగేసి చెబుతున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వారిని విస్మరిస్తూనే ఉందని సంవత్సరాల తరబడి కష్టపడే వారిని వదిలి నెల ముందు డబ్బు సంచులతో వచ్చిన వారికి ప్రాధాన్యతన ఇస్తుందన్నారు యెడవెల్లి కృష్ణ. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నెల ముందు వస్తే సరిపోతుందని సంవత్సరాల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్తగూడెం సీటు కైవసం చేసుకుందామని ఆలోచించిన సిపిఐ పార్టీకి నాలుగు వర్గాలుగా ఛిలిన నాయకులు మద్దతు తెలపడానికి అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నాయకులంతా సపోర్ట్ చేస్తే కొత్తగూడెం సీటు కైవసం చేసుకుందామని ఎదురు చూసిన కూనంనేనికి రోజుకో షాక్ తగులుతోంది. సుదీర్ఘ చర్చ అనంతరం సాధించుకున్న సీటును గెలిపించుకోవడానికి కాంగ్రెస్ క్యాడర్ సిద్ధంగా లేకపోగా సీపీఐలోనూ అసమ్మతి సెగ రాజుకుంది. సొంత పార్టీ బీఫాములతో గెలిచిన కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్‌లో చేరేసరికి సీపీఐ పార్టీ మరింత బలహీన పడినట్లు అయింది. ఏదేమైనా కాంగ్రెస్ కంచుకోటగా విరాజిల్లిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు పొత్తులో భాగంగా సీపీఐని ఆదరిస్తారా లేదా అని ఎదురు చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

Next Story

Most Viewed