నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

by Anjali |
నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలి:  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలు కేంద్రాలు తెరిచి నెల రోజులు గడిచినా 25 శాతం మాత్రమే కొనుగోలు జరిగిందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 రోజులుగా అధికారులకు ఫోన్ చేస్తే ఎన్నికల తరువాత కొనుగోలు చేస్తామని చెప్పారని, ధాన్యం కొనుగోలు అంశంపై ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నా ఏ మాత్రం ఉపయోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే వ్యవసాయ శాఖ మంత్రి హాజరవ్వలేదని గుర్తుచేశారు. ఎన్నికలు అయిపోగానే మంత్రులు విహారయాత్రలకు వెళ్తున్నారు తప్పితే.. రైతులను పట్టించుకోవడం లేదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వరి ధాన్యం కొనుగోలులో రైతులను తూకం ద్వారా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.

తేమ, తాలు, గన్నీ బ్యాగుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. వరి ధాన్యం కొనుగోళ్లలో దళారీ వ్యవస్థ నడుస్తోందని హరీశ్ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి, సివిల్ సప్లయ్ అధికారులు నష్టపోయిన పంటకు పరిహారం అందించే విషయంపై అలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు రూ.30వేల నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ సాకులు చెప్పి ఫసల్ బీమా రైతులకు అందకుండా చేశారని, ఈ ప్రభుత్వం అయినా అందించేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వరిధాన్యం కొనుగోలును యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్.. తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే హరీశ్ డిమాండ్ చేశారు.

Next Story