గందరగోళంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం

by Sridhar Babu |
గందరగోళంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం
X

దిశ, కారేపల్లి : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ గురువారం కారేపల్లి లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలోనే కార్యకర్తలు గొడవకు దిగారు. సంత మాజీ చైర్మన్ మల్లెం నాగేశ్వరావు నాయకులను పరిచయం చేస్తూ వేదిక పైకి పిలిచే క్రమంలో పాతతరం నాయకులను ముందు పిలవకుండా ఇటీవల పార్టీ లో చేరిన వారిని ముందు స్టేజీ పైకి పిలవటంతో గొడవ ప్రారంభమైంది. దీంతో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరాలాల్, గుగులోత్ భీముడు లు అభ్యంతరం తెలిపారు. వీరికి మద్దతు గా

వైరా నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు దారావత్ వినోద్ మరికొంత మంది కార్యకర్తలు స్టేజీ దగ్గర కు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని పగడాల మంజుల, ఇమ్మడి తిరుపతిరావు, మేదర్ వీర ప్రతాప్ లు సముదాయించినా కార్యకర్తలు వినిపించుకోకుండా వేదిక ముందు గందరగోళం సృష్టించారు. ఇదే క్రమంలో కొందరి వైఖరిని నిరసిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు స్టేజీ మీద నుంచి దిగిపోయారు. ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర నాయకులు బొర్ర రాజశేఖర్ లు కార్యకర్తలను సముదాయించి సమావేశం కొనసాగేలా చేశారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే రామదాసు నాయక్ , బొర్ర రాజశేఖర్ కార్యకర్తలను కోరారు.

Next Story

Most Viewed