రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబు

by Disha Web Desk 15 |
రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబు
X

దిశ, భద్రాచలం : రాములోరి కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబు అయింది. దక్షిణ అయోధ్య భద్రాచలం పుణ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు సీతారాముల కళ్యాణం మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభిత కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణ తంతు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై 12.30 గంటలకు ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున స్వామి వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మంగళవారం మధ్యాహ్నమే ఆమె భద్రాచలం చేరుకున్నారు.

ఈసారి కళ్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రి తరలి వస్తారని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలు కలిపి సుమారు 1500 మంది సిబ్బంది కళ్యాణ విధులు నిర్వహిస్తున్నారు. చలువ పందిల్లు, చాందిని వస్త్రాలు, రంగు రంగుల విద్యుత్ దీపాలు, స్వాగత ద్వారాలతో భద్రాద్రి క్షేత్రంను అలంకరించారు. ముఖ్యంగా భక్తులకు వసతి, తాగునీరు, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎండోమెంట్, సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక అలా, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్ రాజ్, రామాలయం ఈఓ రమాదేవి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి కళ్యాణం టికెట్లు దేవస్థానం సీఆర్ఓ కార్యాలయం, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అలాగే ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. స్వామి వారి తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు, అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు ప్రత్యేకంగా బెడ్లు అందుబాటులో ఉంచారు.

కళ్యాణం తిలకించడానికి మండపాన్ని 24 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులను నియమించారు. అలాగే భద్రాచలం వచ్చే భక్తులకు సమాచారాన్ని అందించేందుకు 25 ప్రాంతాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలు అందించడానికి 10 అత్యవసర కేంద్రాలతో పాటు 5 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. స్వామివారి తలంబ్రాలు పంపిణీకి 60 కౌంటర్లు, ప్రసాదాలకు కౌంటర్లు 19 ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ ద్వారా అదనపు బస్సులు నడుపుతున్నారు. స్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే భక్తుల కోసం మినీ బస్సులు, బ్రిడ్జి పాయింట్ బస్టాండ్ నుండి ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు అవాంతరం ఏర్పడకుండా పట్టణంలోని పలు ప్రాంతాలలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. భక్తుల ఇంటివద్దకే తలంబ్రాలు పంపిణీ చేయడానికి టీఎస్ఆర్టీసీ, పోస్టల్ శాఖలు ముందుకు వచ్చాయి.

గురువారం మహా పట్టాభిషేకం

బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణం జరిగిన మరుసటి రోజు గురువారం శ్రీ స్వామి వారికి కళ్యాణం జరిగిన వేదిక పైనే మహా పట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. పట్టాభిషేకం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.


Next Story

Most Viewed