పథకం భేష్.. క్వాలిటీ తుస్..

by Disha Web Desk 20 |
పథకం భేష్.. క్వాలిటీ తుస్..
X

దిశ, వేంసూర్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్నిప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పరచడానికి తీసుకు వచ్చిన అద్భుతమైన పథకం మనఊరు - మనబడి. ఈ పథకం దశలవారిగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టి, లక్షల మంది విద్యార్థులు అభ్యసనా విధానాన్ని మెరుగుపర్చటానికి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలమేర ఈ పథకానికి ఖర్చు చేయనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40 శాతం, పంచాయతీ రాజ్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, కార్పొరేట్ కంపెనీల నుండి విరాళాల సేకరణతో రాష్ట్రప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్ఈఓ, ఎస్ఎమ్ సీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామసర్పంచ్ లు కమిటీ మెంబర్ లుగా ఉంటారు. ఇంతమంచి పథకంలో దొంగలు పడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధిగోడలను దోచుకుంటున్నారు.

వేంసూర్ మండలంలోని పదిహేడు పాఠశాలలు ఈ మన ఊరు మన బడి కింద ఎంపిక చేశారు. ఒక్కోస్కూల్ కు సుమారు పదిలక్షల నుండి యాభై లక్షల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నీటితో కూడిన టాయిలెట్స్, కిచెన్, నీటి సౌకర్యం, విద్యుత్, చిన్నపెద్ద రిపేర్లు, పాడైపోయిన క్లాస్ రూమ్స్ స్తానంలో కొత్తవి, ప్రహరీ గోడలు, సీలింగ్ మొదలగు పనులు చేపట్టారు. కానీ ఏమాత్రం క్వాలిటీ లేదు, పై పై మెరుగులు తప్ప ఏ మాత్రం స్టాండర్డ్ లేవు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. అడసర్లపాడు సీపీఎస్ స్కూల్ ఆర్చి నిర్మాణంలో రోడ్డు పక్కన దొరికిన ఇసుకతో, కావాల్సినంత పరిమాణంలో కాకుండా అతితక్కువ సిమెంట్ ఉపయోగిస్తూ నిర్మిస్తున్నారు.

ఈ విషయంలో ఆర్ అండ్ బీ జేఈని వివరణ అడిగితే అక్కడ పని జరుగుతున్న ట్లు నాకు తెలియదు అన్నారు,అంటే ఏ రీతిన అవినీతి జరుగుతుందో అని ఇట్టే అర్ధం అవుతుంది. రెండవ రకం నాణ్యత లేని కరెంట్ వైర్ లను, పైపులను ఉపయోగిస్తున్నారు. నాప రాళ్లను ఎగుడు, దిగుడుగా ఇష్టమొచ్చినట్లు పేరుస్తున్నారు. క్లాస్ రూముల్లోని నిర్రెలిచ్చిన గోడలమధ్యలో సిమెంట్ ని పై పూతగా రాస్తున్నారు. కనీసం వాటరింగ్ చేయక పోవడం వలన మళ్ళీ నెర్రెలిచ్చాయి.

అలాగే రాయుడు పాలెం, భరణిపాడు, భీమవరం గ్రామంలో కూడా ఇదే పరిస్తితి. మర్లపాడు గ్రామంలో పాఠశాల ఎప్పుడూ కూలిపోతుందో తెలియని స్లాబ్ కు పై పై మెరుగులు దిద్ది చేతులు దులుపుకొన్నారు. పూర్తిగా పాడైన ప్రహరీ గోడను అలాగే ఉంచి సిమెంట్ కూర్చుతున్నారు. కాంట్రాక్టర్లు దగ్గరనుండి అధికారుల వరకు లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము దోపిడీ జరుగుతుంది. వేంసూర్ మండలంలో మన ఊరు మన బడి పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల, అవినీతి పై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాణ్యమైన పనులు జరిగెటట్టు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed